
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
● భార్యకు తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: సీతానగరం మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురి కాగా భర్త అంబటి సుధాకర్ మృతిచెందాడు. భార్య కల్యాణి తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. భార్య కల్యాణితో కలిసి సుధాకర్ గురువారం స్కూటీపై అంటిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ సీతానగరంలో ఇంటికి కావాల్సిన సరుకులు కోనుగోలు చేసి తిరిగి వారి గ్రామానికి వెళ్తున్న క్రమంలో సీతానగరం వంతెనపై వారి స్కూటీని విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో సుధాకర్ (47) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్య కల్యాణిని 108 వాహనంలో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలించారు. సుధాకర్ గతంలో ఎంపీటీసీగా పనిచేసి, ప్రస్తుతం సీతానగరంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. వారికి పాప, బాబు ఉన్నారు. ఈ మేరకు వివరాలు సేకరించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు. సుధాకర్ అకాల మరణంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.