
4జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్‌నెట్ సేవలను వేగంగా అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జియో, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ తొలిదశలో భాగంగా వాహనాలు వెళ్లే సౌకర్యం ఉన్న కొమరాడ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పది గ్రామాల్లో వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు ఉపాధిహామీ పథకం కింద రోడ్లు నిర్మించి, పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇంటర్ నెట్‌తో ముడిపడి ఉన్నందున ఏ గ్రామంలోనూ సిగ్నల్ సమస్యలు ఉండరాదని ఆయన తెలిపారు. టవర్ల ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా లేకపోతే ప్రత్యామ్నాయాలు చూడాలని ఇప్పటికే ఉన్న టవర్ల సిగ్నల్ సమస్యలను కూడా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్‌సప్నిల్ జగన్నాథ్, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, దిలీప్‌చక్రవర్తి, డీఎంజీఓ శ్రీనివాసరావు, పలు మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి