
కొందరికి రూ.2 వేలు.. ఇంకొందరికి రూ.5 వేలు
సాక్షి, పార్వతీపురం మన్యం: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల జమలో గందరగోళం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలతో కలిపి రాష్ట్ర వాటా రూ.5 వేలు మొత్తం రూ.7 వేలను రైతుల బ్యాంకు ఖాతాలో శనివారం జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టారు. పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలో 1.22 లక్షల మందికి రూ.84.58 కోట్లు విడుదల కానున్నట్టు అధికారులు ప్రకటించారు. ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామన్న ప్రభుత్వం.. ఈ వాటాను కేంద్రం అందించే రూ.6 వేలతో కలిపింది. మొదటి, రెండు విడతల్లో రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు చొప్పున, మూడో విడత రూ.4 వేలు చొప్పున మొత్తం రూ.14 వేలు ఇవ్వనుంది. ఈ ప్రకారం కేంద్ర, రాష్ట్ర వాటాలతో కలిపి రైతుల ఖాతాలకు తొలివిడతగా రూ.7 వేలు జమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. తీరా చూస్తే.. రైతుల ఖాతాలకు కొందరికి రూ.2 వేలు జమ కాగా.. మరికొందరి ఖాతాల్లో రూ.5 వేలు పడింది. వారి సెల్‌ఫోన్లకు వచ్చిన సంక్షిప్త సందేశంలోనూ అదే విధంగా రావడంతో అన్నదాతలు నిర్ఘాంతపోయారు. తోటి వారిని ఆరా తీశారు. ఏ ఒక్కరికీ ఒకేలా పడకపోవడం.. ఏకమొత్తం రూ.7 వేలు చాలామందికి రాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. కొందరు రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే.. ఇంకా సమయం ఉందని, నిధులు జమవుతాయని సెలవిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకం నిధుల్లోనూ ఈ విధంగానే కోతలు పడ్డాయి. ఒకరికి రూ.13 వేలు, కొందరికి రూ.9 వేలు, రూ.6 వేలు.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా నిధులు జమయ్యాయి. ఆ మాదిరిగానే ఇదీ చేస్తారా? అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కౌలురైతులకు డబ్బులు పడలేదు. వారికి మలివిడత అందిస్తారని అధికారులు అంటున్నారు.
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల జమలో గందరగోళం
అయోమయంలో రైతాంగం