
పెద్దగెడ్డ నీరు విడుదల
పాచిపెంట: ఖరీఫ్ పంటల సాగుకు మండల కేంద్రంలోని పెద్దగెడ్డ జలాశయం నుంచి 60 క్యూసెక్కుల సాగునీటిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దగెడ్డ ఆధునికీరణ నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో 22 కోట్ల జైకా నిధులు మంజూరయ్యాయని, అందులో కొంతమేర మాత్రమే లైనింగ్ పనులు జరిగాయన్నారు. మిగతా పనులు పునఃప్రారభమయ్యేలా చర్యలు చేపట్టి చివర ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాంచాలి సర్పంచ్ గూడెం యుగంధర్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.