
బోధనేతర విధులు అంటగట్టొద్దు
పార్వతీపురం: ఉపాధ్యాయులను బోధనకు తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలకు వినియోగించవద్దని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్, రాష్ట్ర పరిశీలకుడు గణపతి, చైర్మన్ పి.కూర్మినాయుడు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్‌రూల్స్ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధ విధానాలను తొలగించాలన్నారు. పీ–4కు ఉపాధ్యాయులకు నిర్బంధిచరాదన్నారు. ఎంఈఓ–1 పోస్టుల భర్తీ, ఇన్‌చార్జిల నియామకంలో జీఓ నంబర్ 73 ప్రకారం ఉమ్మడి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటుచేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ పథకాన్ని అమలుచేయాలన్నారు. రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిలను తక్షణం చెల్లించాలన్నారు.
మూడు పెండింగ్ డీఏలు, 11వ పీఆర్‌సీ, సరెండర్ లీవ్‌ల బకాయిలను చెల్లించాలన్నారు. అంతర జిల్లాల బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మర్రాపు మహేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా