
జిల్లాను ముందంజలో నిలపడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మండల స్థాయి అధికారులకు పిలుపునిచ్చారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్(సాస్) కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. నీతిఅయోగ్ సూచికలలో సంతృప్తికర ఫలితాలు సాధించిన జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బందిని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవతో కలసి పతాకాలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఓ మురళీధర్, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, డీఈఓ బి.రాజ్‌కుమార్, డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూన, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
భాగస్వామ్యంతోనే అభివృద్ది సాధ్యం
వివిధ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న ఆది కర్మయోగి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. సేవ, సమర్పణ, సంకల్పం అనే సూత్రాల ఆధారంగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ జిల్లాలో 113 గ్రామ సచివాలయ పరిధిలోని 165 గ్రామాలను మొదటి విడతలో ఆది కర్మయోగి కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ, పీఎం జన్‌మన్ ప్రాజెక్టు అధికారి రిషబ్ ద్వివేది మాట్లాడుతూ సమగ్రమైన ఆలోచన, సామాజిక అవగాహనతోనే గిరిజనాభివృద్ధి సాధ్యమన్నారు.
● ఆకాంక్ష హత్‌తో మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగు పడనుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా సంఘాలు తయారుచేసిన వస్తువుల ప్రదర్శన, విక్రయాల స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు.