ఇంధన సెగలు! | - | Sakshi
Sakshi News home page

ఇంధన సెగలు!

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

ఇంధన సెగలు!

ఆయిల్‌ కంపెనీల నుంచి అరకొర సరఫరా జిల్లాలో డీజిల్‌ కోసం బంకుల వద్ద బారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్న వాహన చోదకులు వాహనాన్ని బట్టి పరిమితంగా డీజిల్‌ కొడుతున్న బంకులు జిల్లాలో పెట్రోలు లేక 5, డీజిల్‌ లేక 60 బంకులు మూత జిల్లా వ్యాప్తంగా 194 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు

ఆందోళన అవసరం లేదు

సత్తెనపల్లి: ఇంధనం మంట పుట్టిస్తోంది. ఇన్నాళ్లు గ్యాస్‌ దడ పుట్టించగా.. ఇప్పుడు డీజిల్‌, పెట్రోల్‌ గుబులు రేకెస్తోంది. తగినంతగా డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా లేకపోవడం.. అవసరానికి దొరకదేమోనని ఆందోళనతో వాహన చోదకులు పెట్రోల్‌ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఆయిల్‌ ఏ బంకులో ఉంటే అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది.

సరఫరాకు తీవ్ర అంతరాయం...

జిల్లాలో 194 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు పెట్రోల్‌, డీజిల్‌ సాధారణ వినియోగం రెట్టింపు అయింది. అయితే ప్రస్తుతం సగం కూడా సరఫరా కావడం లేదని సమాచారం. జిల్లాలో పెట్రోల్‌ లేక 5 బంకులు, డీజిల్‌ లేక 60 బంకులు ఇప్పటికే మూతబడ్డాయి. ఆందోళన చెందుతున్న వాహనదారులు ముందు జాగ్రత్తగా అవసరానికి మించి డీజిల్‌, పెట్రోల్‌ కొట్టిస్తున్నారు. దీంతో ఒక్క సారిగా డిమాండ్‌ పెరిగి గంటల వ్యవధిలోనే బంకుల్లో నిల్వలు ఖాళీ అవుతున్నాయి. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచలేదు. ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో మోదీ సర్కార్‌ వీటి ధరలను పెంచేస్తుందనే భయంతో కూడా ప్రజలు ముందస్తుగా డీజిల్‌, పెట్రోల్‌కు ఎగబడుతున్నారు. ఇదే అదునుగా కొన్ని బంకుల యజమానులు బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పరిమితంగా అమ్మకాలు...

ఈ నేపథ్యంలో పలు బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ విక్రయాలను యాజమాన్యాలు పరిమితం చేశాయి. ఆటోలకు రూ. 200, కార్లకు రూ.500, భారీ వాహనాలకు రూ.1000 విలువైన డీజిల్‌ మాత్రమే పోస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ. 200, కారుకు రూ. 500 పెట్రోల్‌ మాత్రమే పోస్తున్నారు. అంతకన్నా అవసరమైన వారు మరో బంకును ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో దూర ప్రాంతాలకు వెళుతున్న వారు ఒకటి, రెండు బంకుల వద్ద డీజిల్‌, పెట్రోల్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.

కొరత ఎందుకంటే...

యుద్ధం మొదలైన తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే చమురు తగ్గడం, స్థానికంగా ఉన్న బఫర్‌ స్టాక్‌ను పెద్ద ఎత్తున వినియోగించడం వంటి కారణాలతో సరఫరా చైన్‌ తెగిపోయింది. కంపెనీలకు ఆర్డర్‌ పెడుతుంటే నెల ఆఖరి వరకు డీజిల్‌ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధర పెరగడంతో ఇప్పుడున్న రేట్లకు అమ్మితే నష్టపోతామనే ఉద్దేశంతో కంపెనీలు తగినంత సరఫరా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. సత్తెనపల్లిలో 5 పెట్రోల్‌ బంకులు ఉంటే 2 బంకుల్లో మాత్రమే అరకొరగా డీజిల్‌ ఆదివారం లభించింది. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

రైతులకు తప్పని కష్టాలు

జిల్లాలో ప్రస్తుతం రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. యంత్రాలతో వరికోతల కోయిస్తున్నారు. ఈ యంత్రాలతో అవసరమైన డీజిల్‌ లభించక పోవడంతో వరి కోతలకు ఆటంకం కలుగుతుంది. అది కూడా ఖాళ్లీ టిన్నులు, సీసాల్లోకి డీజిల్‌ కొట్టవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. వరి కోత యంత్రాలను పెట్రోల్‌ బంకుల వద్దకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. వాటికి టిన్నుల ద్వారానే డీజిల్‌ పోయాలి. దీంతో చేసేది లేక లీటర్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా చెల్లించి బ్లాక్‌ మార్కెట్లో డీజిల్‌ కొనుక్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మరోవైపు డీజిల్‌ కొరతను సాకుగా చూపి, వాటి అద్దెలను యజమానులు భారీగా పెంచారు. గతంలో ఎకరాకు రూ.2,500 అద్దె ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.3 వేలకు పెంచేశారు. డీజిల్‌ కొరత కారణంగా అన్ని రంగాలపై ప్రభావం కనిపిస్తోంది.

డీజిల్‌, పెట్రోల్‌ కోసం జిల్లాలోని ప్రజలు, వినియోగదారులు ఎటువంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారం కారణంగా అనవసరమైన డిమాండ్‌ సృష్టిస్తున్నారు. నిల్వలు లేక అడుగంటిపోయిన బంకులకు ఆయిల్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా డీజిల్‌ అవసరాలు ఉన్న పెట్రోల్‌ బంకులకు 10 శాతం అదనంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ఆయిల్‌ అందుబాటులో ఉంటుంది. బంకుల యాజమాన్యాలు వాణిజ్య అవసరాల కొరకు ఆయిల్‌ విక్రయించినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– ఎంవీ ప్రసాద్‌,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పల్నాడు

Advertisement
 
Advertisement
Advertisement