చిలకలూరిపేట పట్టణ పరిధిలో 12 స్థలాలను రెసిడెన్షియల్ నుంచి ఇండస్ట్రియల్‌కు మారుస్తూ గెజిట్ 2024లో ఇవే ప్రదేశాలు ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్‌కు మార్పు నివాస ప్రాంతాల మధ్య ఉన్న ఆ స్థలాల్లో ఇప్పటికే ప్లాట్లు వేసి విక్రయాలు ఇప్పుడు తిరిగి ఇండస్ట్రియల్ లేదా కమర్షియల్ అనడంతో ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళన
చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి!
చిలకలూరిపేట: పురోగమనం నుంచి తిరోగమనం వైపు అన్న చందంగా ఉంది కూటమి పాలకుల తీరు. ఒకసారి రెసిడెన్షియల్ అని ప్రకటించి, అధికారికంగా వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మళ్లీ పాట్లు తప్పని పరిస్థితి ఎదురైంది. వివరాలు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని బాలాజీ థియేటర్, పెదనందిపాడురోడ్డు, ఆర్టీసీ కాలనీ, ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని గోల్కొండ గార్డెన్స్, సంజీవనగర్, పండరీపురం, కోండ్రుపాడు, చీరాల రోడ్డులోని కక్కెర దాసయ్య గోడౌన్లు వంటి మొత్తం 12 ప్రదేశాలను 2024 మార్చి 13న ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రెసిడెన్షియల్‌కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సవరించిన మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా కొంతమంది స్థల యజమానులు ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. రెసిడెన్షియల్‌గా మారిన నేపథ్యంతో పాటు, సంబంధిత స్థలాలు నివేశ ప్రాంతాల మధ్యలో ఉండటంతో ఆ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రజలు కొనుగోలు చేశారు.
హఠాత్తుగా ఇండస్ట్రియల్‌లోకి...
అయితే ఉరమని ఉరుములా హఠాత్తుగా ఈ 12 ప్రదేశాలను రెసిడెన్షియల్ నుంచి తిరిగి ఇండస్ట్రియల్/కమర్షియల్‌లోకి మారుస్తూ ఈ నెల రెండో తేదీన ప్రభుత్వం గెజిట్(రాజపత్రం) జారీ చేసింది. దీంతో సంబంధిత ప్రదేశాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విషయం తెలుసుకున్న సంబంధిత ప్లాట్ల కొనుగోలు దారులు, స్థల యజమానులు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అవి రెసిడెన్షియల్ జోన్‌లోనే కొనసాగించాలని తమ అభ్యంతాలను తెలియజేశారు.
అత్యధిక శాతం ప్లాట్లుగా ...
గతంలో రెసిడెన్షియల్‌కు మారిన 12 ప్రదేశాల్లో అత్యధిక స్థలాల్లో ఇప్పటికే ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం కూడా జరిగింది. ఉదాహరణకు చీరాల రోడ్డులో ఉన్న కక్కెర దాసయ్య గోడౌన్ల స్థలానికి సంబంధించి 10.60 ఎకరాలకు గాను గతంలో ఆ స్థలాల వెనుక భాగంలో 1.5 ఎకరాలను స్థల యజమానులు విక్రయించగా అందులో ఇప్పటికే గృహాలు నిర్మాణం చేసుకొని పలువురు నివాసం ఉంటున్నారు. మరో 6.25 ఎకరాలు రెసిడిన్షియల్‌గా మారగా మరో 2.85 ఎకరాల్లో గోడౌన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం భూమిని ఇండస్ట్రీయల్‌కు మారుస్తూ గెజిట్ జారీ కావడంతో బెంబేలెత్తడం ప్లాట్లు కొనుగోలు చేసిన వారి వంతయింది. దీంతో ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వాసవి గార్డెన్స్ పేరుతో సంఘం ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వీరు డీటీసీపీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 21న పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన టీపీఎస్ లక్ష్మణస్వామి, స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలసి విచారణ నిర్వహించారు. అయితే ఏమవుతుందోనన్న ఆందోళనలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో పాటు, స్థల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాలను రెసిడెన్షియల్ జోన్‌లోనే కొనసాగించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నారు.
పాత ఉత్తర్వులకు భిన్నంగా ఉన్నపళంగా కొత్త గెజిట్ జారీ చేయాల్సి రావడం వెనుక ఓ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెసిడెన్షియల్ నుంచి ఇండస్ట్రియల్/ కమర్షియల్‌లోకి మార్చి సంబంధిత స్థల యజమానులపై ఒత్తిడి తేవడం ద్వారా వారి నుంచి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా ఈ వ్యవహారం కొనసాగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు 2024లో వెలువడిన మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి రెండేళ్లకే తిరిగి సంబంధిత స్థలాలను ఇండస్ట్రియల్‌లోకి మార్చేలా ప్రణాళిక రూపొందించటం వివాదస్పదంగా మారింది. 12 ప్రదేశాలకు సంబంధించి రెండు స్థలాల వారు రెసిడెన్షియల్‌గా మారినప్పటికీ అక్కడ ఉన్న గోడౌన్లను తొలగించటకపోవడం ఆసరాగా చేసుకొని తిరిగి అన్ని స్థలాలను ఇండస్ట్రీయల్‌గా చేయడం ఎక్కడి న్యాయమని ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


