సరసరదాగా చెరువుకు వెళ్లి మృత్యువాత యడ్లపాడులో విషాదం
యడ్లపాడు: చిన్నారులకు సెలవులు.. అసలే ఆదివారం.. సరదాగా గడుపుతున్నారు.. చెరువుకు వెళ్లి మృత్యువాత పడిన ఘటన యడ్లపాడులో చోటుచేసుకుంది. వివరాలు... బోయపాలేనికి చెందిన షేక్ ఇమాంసా, అమినాబి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా వీరు యడ్లపాడు గ్రామానికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరిలో చిన్నవాడు షేక్ మొహమ్మద్ అహమ్మద్(17) గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదవుతున్నాడు. వీరి నివాసానికి సమీపానే ఉన్న యడ్లపాడుకు చెందిన ప్రైవేటుగా విద్యుత్ పనులు చేసుకుని జీవనం సాగించే షేక్ మస్తాన్‌వలి, మునీరాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడైన షేక్ అమానుల్లా(13) స్థానిక జెడ్పీహైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరు ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో సైకిల్‌పై గ్రామంలోని జగ్గాపురం రోడ్డులో ఉన్న చవిటిచెరువు వద్దకు వెళ్లారు. ఆ చెరువు లోతుపై అవగాహన లేకపోవడం, అడుగున ప్రమాదకరమైన ఊబి ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని వారు ఊహించలేకపోయారు. నీటిలోకి దిగిన కొద్దిసేపటికే ఆ ఊబి వారిని మృత్యువు వైపు లాగేసింది. చీకటి పడుతున్నా బిడ్డలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. చెరువు ఒడ్డున ఉన్న సైకిల్, చెప్పులు వారి గుండెల్లో రాయి వేశాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా, రెండు గంటల తర్వాత ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటి వరకు తమ బిడ్డలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశించిన ఆ పేద కుటుంబాలకు, విగతజీవులుగా పడి ఉన్న వారిని చూశాక గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్క క్షణం సరదా.. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుని ఆ కుటుంబాల్లో తీరని చీకటిని మిగిల్చింది.


