జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం
నరసరావుపేట రూరల్: పోలీసు శాఖకు అప్రతిష్ట తీసుకువచ్చే ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం మార్చి నెల నేర సమీక్ష నిర్వహించారు. మాచర్ల ప్రాంతంలోని పోలీసు అధికారులు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై సమావేశంలో ఎస్పీ ఘాటుగా స్పందించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సంబంధిత ఎస్‌హెచ్‌వోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రోల్‌కాల్‌ను క్రమతప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగులో ఉన్న కేసుల విచారణ పురోగతి, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల నివారణ, రౌడీషీటర్లపై చర్యలు, పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు ఉల్లఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. రౌడీషీటర్లను ప్రతి వారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. బైండోవర్ చేయించి వారిపై నిఘ ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పలు నేరాలను ఛేదించడంలో, కేసులను సమగ్ర దర్యాప్తులో విశేష ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను, ఎస్‌బీ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ట్రైనీ ఎస్పీ నిరంజన్, డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


