ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఆదివారం రూ.3.54 లక్షల విలువైన బంగారంహారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన వేమూరి శివరామప్రసాద్ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి సుమారు 23 గ్రాముల బంగారం, రూ. 3,54,292 విలువ కలిగిన బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి భక్తులకు ఆలయ వేద పండితులు దిలీప్‌కుమార్ సౌజన్యంతో ఆలయం వారు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావటంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి.


