నిర్లక్ష్యపు ముద్ర! | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు ముద్ర!

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

భారీగా తరలుతున్న ఇసుక

సొంత పార్టీ నేతకు తప్పని కష్టాలు

రెండేళ్ల నిద్ర..

సాక్షి, నరసరావుపేట: సమస్యలు తలెత్తకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ కుడి కాలువ చివరి భూములకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందిస్తామని 2024 సంవత్సరం ఏప్రిల్‌ 6న క్రోసూరు సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లు అవుతున్నా నేటికీ ఆ దిశగా అడుగులు లేవు. దీంతో వ్యవసాయాధారిత నియోజకవర్గమైన పెదకూరపాడులో రైతులు తీవ్ర సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమరావతిలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందుబాటులో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పెదకూరపాడులో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చి నిలుపుకోలేదు.

పెదకూరపాడుకు ఐటీ పార్క్‌ ఏదీ?

ఉమ్మడి రాష్ట్రంలో తాను హైటెక్‌ సిటీ తెచ్చానని, 2024లో అధికారంలోకి రాగానే పెదకూరపాడుకు సైతం ఐటీ పార్క్‌ తెస్తానని క్రోసూరు సభలో హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలు పెదకూరపాడులో ఏర్పాటు చేస్తాయని, ఈ నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌ వెళ్లాల్సిన పని లేదన్నారు. రెండేళ్లలో ఐటీ పార్క్‌ కాదు కదా.. వాకింగ్‌ చేయడానికి పచ్చిగడ్డితో నియోజకవర్గంలో ఓ పార్క్‌ను కూడా ఏర్పాటు చేసిన పాపానపోలేదు. ముస్లింలకు దుల్హాన్‌ పథకం అమలు చేస్తామని, రంజాన్‌ తోఫా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తావ్‌ బాబూ.. అంటూ ముస్లిం సోదరులు నిలదీస్తున్నారు. పంచారామంలో ప్రథమమైన అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి ఆధ్యాత్మికంగా మరింత గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ ఆనవాళ్లు లేవు. కనీసం ఆలయ భూముల సమస్యలు సైతం తీర్చలేదు. అమరావతిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. బౌద్ధులు, జైనులు తిరిగిన పుణ్యభూమి అమరావతి అని, ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ అన్నారు. అభివృద్ది చేయకపోగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 14వ తేదీన రూ.15 కోట్లతో ప్రారంభించిన ధ్యాన బుద్ధ వనాన్ని సైతం నిర్వహణ లేకుండా చేశారు. కాలచక్ర మ్యూజియం, బుద్ధ సర్క్యూట్‌ వంటివి అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

కృష్ణానది పరీవాహక ప్రాంతమైన పెదకూరపాడులో ఇసుకాసురుల ఆట కట్టించి అక్రమ దందాను ఆపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నిత్యం వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ప్రవీణ్‌ను మించిన ఇసుకాసురుడు లేడని, ఆయన్ని ఏం చేశావ్‌ బాబూ అంటూ పెదకూరపాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మట్టి దోపిడీ సొమ్ము వాటాల పంపిణీలో తేడాలొచ్చి సొంత పార్టీ నేతలపైనే పెదకూరపాడులో నియోజకవర్గంలో ముసుగు దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి రహితంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా... గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామగ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి ఆయా కంపెనీలలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క కంపెనీ ఏర్పాటుకాకపోగా యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది.

ఓటేసి గెలిపించిన ప్రజలనే కాదు సొంత పార్టీ నేత, సీనియర్‌ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను సైతం సీఎం చంద్రబాబు మోసం చేశారన్న వాదనలు ఆయన వర్గం నుంచి వినిపిస్తున్నాయి. మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన శ్రీధర్‌ను కాదని డబ్బుల సంచితో వచ్చిన బాష్యం ప్రవీణ్‌కు గత ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న శ్రీధర్‌ వర్గాన్ని శాంతించేందుకు క్రోసూరు సభ సాక్షిగా అధికారం రాగానే కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఎమ్యెల్సీ ఇవ్వకపోగా... అప్పటివరకు ఉన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుంచి సైతం అవమానకరంగా తప్పించి భాష్యం ప్రవీణ్‌ అనుచరుడికి అప్పగించారని శ్రీధర్‌ వర్గం మండిపడుతోంది. ఓ ముఖ్య నేత అండతో శ్రీధర్‌, ఆయన వర్గాన్ని అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన వర్గీయులు తెలిపారు. చంద్రబాబు స్పందించి శ్రీధర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement