17న రైతు ధర్నాకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

17న రైతు ధర్నాకు సన్నాహాలు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

మండలానికొక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆందోళనలో రైతులు బ్లాక్‌ మార్కెట్లో ఎరువుల కొనుగోలుతో జేబులకు చిల్లు తెలుగుదేశం పార్టీ దళారుల చేతుల్లోకి తక్కువ ధరకే పంట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డిల ధ్వజం

సాగుపై నేటికీ

చంద్రబాబు చిన్నచూపు

సర్కారు తీరు దారుణం

నరసరావుపేట: మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రతి మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17వ తేదీన నరసరావుపేటలో రైతు ధర్నా చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి ప్రకటించారు. గుంటూరు రోడ్డు పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12.35 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట పండించారన్నారు. అలాగే పల్నాడు జిల్లాలో 53,739 హెక్టార్లలో సాగు చేశారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల భవిష్యత్తును దళారుల చేతిలో పెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ దళారీ వ్యవస్థ మొక్కజొన్న క్వింటాలుకు రూ.1600 నుంచి రూ.1700 కు మాత్రమే కొనుగోలు చేస్తూ క్వింటాకు రూ.800 దిగమింగుతున్నట్లు చెప్పారు. పంట సాగు సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు. రైతులకు పార్టీ ముద్ర వేసి కేవలం తెలుగుదేశం పార్టీ చెందిన వారికే సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా చేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ వారు, మిగతా రైతులకు ఎరువులు ఇవ్వలేదని ఆరోపించారు. వీరందరూ కట్ట ఎరువుకు రూ.300 నుంచి రూ.500 వరకు అధిక ధరకు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేశారన్నారు. దీనివల్ల సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావలసిన ఎరువులు, విత్తనాలను అడిగిన వెంటనే సరఫరా చేసిందని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు పంటలు కొనుగోలు చేసిందని, రైతులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. శనగలు, మినుములు తదితర పంటలకు ధర విషయంలో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, దీనివల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని, రూ.3 వేల కోట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు ఉండేదని చెప్పారు. నెలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తోందని, వాటిలో ఆరోగ్యశ్రీకి రూ.3 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి మరో రూ.3 వేలు కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తీసుకున్న అప్పుల మొత్తం అంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న వర్షానికే జలమయమయ్యే రాజధాని అమరావతిలో డబ్బంతా వృథాగా ధారబోస్తున్నారన్నారు. తక్షణమే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న పంట కొనుగోలుకు మండలానికో కేంద్రం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు అవుతారని, రైతులు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయమే దండగ, రైతు వ్యవస్థ ఉండకూడదనే సిద్ధాంతాన్ని చంద్రబాబు చెబుతున్నారని ఆరోపించారు. రైతు వ్యవస్థ లేకుండా ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని అన్నారు. రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం రాణించిన దాఖలాలు లేవని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుకు ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. పంటను తెలుగుదేశం పార్టీ దళారీ వ్యవస్థ దోచుకుంటోందని, రైతు పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందున ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అన్నెం పున్నారెడ్డి మాట్లాడుతూ రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని, ఆయన రైతుల్ని గాలికి వదిలేసి కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికి పరిమితం అవుతున్నారని చెప్పారు. రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండించినా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచిందని తెలిపారు. దళారులకు కూటమి ప్రభుత్వం తొత్తుగా మారిందని విమర్శించారు. రొంపిచర్ల మండల అధ్యక్షుడు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పొనుగోటి వెంకటరావు, రొంపిచర్ల మండల నాయకులు గెల్లి చినకోటిరెడ్డి, పోతులూరి సుబ్బారెడ్డి, బీరం భాస్కరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement