22న రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు రాక
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా గుంటూరు రానున్నారు. బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తపాలా శాఖ ఉద్యోగుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా , గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్‌లు తపాలా శాఖ అధికారులతో కలసి గురువారం పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది తపాలా శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని, ఆ మేరకు అన్ని సౌకర్యాలు పక్కాగా ఉండాలని అన్నారు.
వేమూరు: గోవాడ గంగా పార్వతి సమేత బాల కోటేశ్వర స్వామి మహాశివరాత్రి తిరునాళ్లకు రూ.53,04,785 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాస్ వర్మ గురువారం వెల్లడించారు. అమర్తలూరు మండలం గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. హుండీ ద్వారా రూ.16,33,235, అభిషేకం ద్వారా రూ.8,85,100, దర్శనం ద్వారా రూ.10,46,450, ఖాళీ స్థలం, కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల విక్రయం ద్వారా రూ. 18,40,000 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ అధికారి వి.అనుపమ, ఎంపీడీవో మారుతీ శేషాంబ, గ్రామ సర్పంచ్ మండవ విజయలక్ష్మి, దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పెదకాకాని: గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవంలో చివరిరోజు గురువారం భ్రమరాంబ అమ్మవారు పుష్పశయ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. పెదకాకాని శివాలయంలో సుప్రభాతసేవ, హారతులు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన జరిగాయి. సాయంత్రం పంచహారతులు, ద్వాదశ ప్రదక్షిణలు, పుష్ప శయనోత్సవం, ఫలప్రదానాలు, దంపతులకు తాంబూలాలు, పవళింపు సేవలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.
తాడికొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సంయుక్త కార్య దర్శిగా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలానికి చెందిన గోపిదేశి శివ నాగేంద్ర శ్రీనివాస్‌ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవిని అప్పగించినందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు(డైమండ్)కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.
22న రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు రాక


