ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలో అందుబాటులో కంట్రోల్ రూమ్ 34,376 మంది విద్యార్థులకు 49 పరీక్ష కేంద్రాలు
ముందుగానే చేరుకుంటే మేలు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్ష కేంద్రాలలో 34,376 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం 16,594, ద్వితీయ సంవత్సరం 15,628 మంది ఉన్నారు. ఒకేషనల్‌లో తొలి ఏడాది వారు 1,146, ద్వితీయ సంవత్సరం వారు 1,008 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 814 మంది ఇన్విజిలేటర్లు, మూడు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లను, ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టమెంట్ ఆఫీసర్‌ను నియమించారు. ఆయా పరీక్ష కేంద్రాలకు ఇప్పటికే సామగ్రి అందించారు. ప్రశ్నపత్రాలు కేంద్రాలకు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లకు చేరుకున్నాయి. నిర్వహణలో పొరపాట్లు, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.
హాల్ టిక్కెట్లు పొందేందుకు
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు http://bie.ap.gov.in సైట్‌లో లాగిన్ కావాలి. టెన్త్ హాల్ టిక్కెట్ నంబరు ఎంటర్ చేసి ఇంటర్ హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్ టిక్కెట్ నంబరు, ఆధార్, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టిక్కెట్ పొందవచ్చు. మనమిత్ర వాట్పాప్ నంబరు 95523 00009 కు ‘ఏజీ’ అని మెసేజ్ పంపడం ద్వారా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా ఓకే
వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు పరీక్షల షెడ్యూల్, సబ్జెక్టుల వివరాలను సరి చూసుకోవాలి. హాల్ టిక్కెట్‌పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల స్టాంప్ అవసరం లేకుండా నేరుగా పరీక్షలు రాసేందుకు హాజరు కావచ్చు.
ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా ఇంటర్మీడియేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు డీఐఈఓ ఎం.నీలావతిదేవి తెలిపారు. పరీక్ష సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ 08647–223355 నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. విద్యార్థుల హాల్ టిక్కెట్లు జారీ చేశామన్నారు. వారికి కేటాయించిన కేంద్రం చిరునామాను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 8 గంటలకు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. 8.30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారని వివరించారు. ఉదయం 9 గంటల తరువాత వచ్చిన వారికి కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.
– ఎం.నీలావతిదేవి, డీఐఈఓ, పల్నాడు జిల్లా
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి


