మహిళా దొంగ అరెస్ట్
చీరాల రూరల్: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు నల్లపూసల దండ దొంగిలించిన మహిళను రైల్వే జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి రూ. 2,16,000 విలువైన బంగారు దండను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జీఆర్పీ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితురాలి వివరాలను జీఆర్పీ సీఐ ఎస్‌కే మౌలా షరీఫ్ వెల్లడించారు. 60 ఏళ్ల వయస్సు కలిగిన చీరాలకు చెందిన గోలి స్వరాజ్యం అనే మహిళ 27 డిసెంబర్ 2025న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తుండగా ఆమె బ్యాగులోని జిప్ తెరచి 36 గ్రాములు బరువు కలిగిన బంగారు నల్లపూసల దండను గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. అయితే బాధితురాలు 6 జనవరి 2026న చీరాల జీఆర్పీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి. మురళీధర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరీఫ్, చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య దర్యాప్తును వేగవంతం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి..
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరిఫ్, ఎస్సై సీహెచ్ కొండయ్య కేసును ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అనేక సీసీ కెమెరాలను నిరంతరాయంగా పరిశీలించి ఒకే రోజులో అంటే బుధవారం దొంగను గుర్తించారు. నిందితురాలు చీరాల రామ్‌నగర్‌కు చెందిన చిన్నపోతుల రోజాను అరెస్టు చేశారు. ఆమెవద్దనున్న 2,16,000 విలువైన బంగారు నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఒకే రోజులో కేసును ఛేదించిన సీఐ మౌలా షరీఫ్, ఎస్సై సీహెచ్ కొండయ్యతో పాటు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


