
రాయే.. మృత్యువాయే
అద్దంకి/ బల్లికురవ: పొట్టచేతపట్టుకుని గ్రానైట్ క్వారీలో పనిచేసేందుకు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఆరుగురు కార్మికులు గ్రానైట్ రాయి మీదపడి ప్రాణాలు వదిలారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు. బల్లికురవ సమీపంలోని చెన్నునల్లి–అనంతవరం రహదారిలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల క్వారీ అయిన ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో ఆదివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సంఘటన సుమారు ఉదయం 10.30 గంటలకు జరగ్గా, గంట తరువాత స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎవరినీ అనుమతించలేదు. దాంతో అక్కడ ఇంకా కొంతమంది మృతిచెంది ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే మీడియాను అనుమతించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు 70 మందికిౖ పెగా మృతి
బల్లికురవ, సంతమాగులూరు ప్రాంత క్వారీల్లో ఇప్పటివరకూ దాదాపు 70 మందికి పైగా బతుకు తెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చి పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఇలాగే వదిలేస్తే మరికొంత మంది కార్మికుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా క్వారీల యజమానులు కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వడంతోపాటు, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. అలాగే మైనింగ్ శాఖ క్వారీలపై నిరంతర నిఘాతో పర్యవేక్షణ చేస్తేనే మరో ప్రమాదం జరగకుండా చూసుకునే అవకాశం ఉంది.
భద్రతా చర్యలు గాలికి..
క్వారీల్లో నిపుణుడైన మేనేజరు (ఫస్ట్‌క్లాస్) మేట్ పర్యవేక్షణలో కార్మికులు రాయిని తీయాల్సి ఉంది. క్వారీల్లో మ్యాగజైన్/బ్లాస్టింట్ మెటీరియల్‌ను జాగ్రత్తగా దాచే విధానం ఉండాలి. అక్రమ నిల్వలతో బ్లాస్టింగ్ చేయడంతో అదీ ప్రమాదాలకు దారితీస్తోంది. బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వలకు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దాని విషయంలో అనుమతులున్న క్వారీలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఒక్కో క్వారీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు 100 నుంచి 150 వరకు ఉంటారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వీరిచేత పనులు చేయిస్తుండడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
చరిత్రలోనే భారీ ప్రమాదం
ఈ ప్రాంతంలో క్వారీల చరిత్రలోనే ఈ ఘటన భారీ ప్రమాదంగా నిలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
అద్దంకి రూరల్: బల్లికురవ మండలంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి పానెం చిన హనిమిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పొట్టకూటి కోసం ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
క్వారీలో గ్రానైట్ రాయి పడి ఆరుగురు దుర్మరణం
కనీస భద్రతా చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణం సకాలంలో ప్రాథమిక వైద్యం అందక పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలను గ్రానైట్ టిప్పర్‌లో తీసుకొచ్చి ఆస్పత్రి దగ్గర పడేసిన వైనం ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తున్న అధికారులు ఒక్క బల్లికురవ పరిసర క్వారీల్లో ఇప్పటికి వరకు 70 మందికిపైగా మృతి