
తవ్వుకో.. తరలించుకో!
రాజుపాలెం: క్వారీల్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులను అక్రమార్కులు తమ గుప్పెట్లో పెట్టుకుని మరీ ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజుపాలెం మండలంలోని కోటనెమలిపురి పరిధిలో కొండమోడు సమీపంలోని ముగ్గురాయి క్వారీల్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా కొంతమంది దళారీలు ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేస్తూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
అడ్డగోలుగా మైనింగ్
అనుపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి పిడుగురాళ్ల మండల పరిధిలో మైనింగ్‌కు సంబంధించి పర్మిషన్ ఉంది. ఈ క్రమంలో సదరు వ్యక్తికి సంబంధించిన మైనింగ్ బిల్లులను రాజుపాలెం మండల పరిధిలోని కొండమోడు క్వారీలలో దళారులు వాడుకుంటూ, అడ్డగోలుగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు లక్షల రూపాయల తెల్లరాయిని బయటకు తీస్తూ పిడుగురాళ్ల సమీపంలోని ముగ్గు మిల్లులకు అమ్మేస్తున్నారు. గత పది నెలలుగా ఈ తంతు జరుగుతున్నా.. మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా క్వారీలలో ఉన్న మట్టిని గుంటూరు, హైదరాబాద్‌లలోని ప్రధాన రహదారుల కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రూ.లక్షల విలువైన తెల్లరాయిని బయటకు తీసి యథేచ్ఛగా అమ్ముకుంటున్నా.. రెవెన్యూ, పోలీసు శాఖ, మైనింగ్‌శాఖ పట్టించుకోక పోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకుంటూ దళారులు రూ.కోట్లు గడిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్.. యథేచ్ఛగా తరలింపు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని అధికారులు
కొండమోడులో ముగ్గురాయి అక్రమ మైనింగ్
ఇళ్లు.. ఒళ్లు గుల్ల
ట్రాక్టర్‌కు ట్రాక్టర్ ఎత్తున ముగ్గు రాయి వేసుకుని గ్రామంలో ట్రాక్టర్లు అతివేగంగా తిరగడం వలన పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని కొండమోడు గ్రామస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా ముగ్గురాయి ధూళితో రోడ్లు, ఇళ్లు పాడవటమే కాకుండా ఆరోగ్యానికి సైతం హానికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు కల్పించుకుని తమ గ్రామం మధ్యలోనుంచి ట్రాక్టర్లు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తవ్వుకో.. తరలించుకో!