
హాస్టళ్లలో వసతులు కల్పించండి
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ పి.అరుణ్‌బాబును కలిసి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పల్నాడు జిల్లాలో గంజాయి విక్రయాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రభుత్వ వసతి గృహాలలో కనీస వసతులు కరువయ్యాయని, వసతి గృహాల నిర్వహణ దారుణంగా ఉందని అన్నారు. విద్యార్థులకు పురుగులు పట్టిన అన్నం, కుళ్లిన కూరగాయలతో ఆహార పదార్థాలు వండుతున్నారని, వెంటనే నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కలిసి విన్నవించటం జరిగిందన్నారు.
జోరుగా గంజాయి విక్రయాలు
జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని, కొందరు యువకులు గంజాయి సేవించి ప్రభుత్వ వసతి గృహాల్లోకి దూరి చదువుకుంటున్న పిల్లల్ని కొట్టి వారిచేత పనులు చేయించుకుంటున్నారని అన్నారు. కొద్దిరోజుల క్రితం 10 నుంచి 15 మంది పిల్లలు గంజాయి సేవించి ఒక కారు అద్దెకు తీసుకొని, ఆ కారును సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద గంజాయి మత్తులో పిల్లలపైకి నడిపారని, దీంతో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయని, ఒక పాపకు చేయి విరిగిందన్నారు. ప్రజా సంఘం నాయకుడికి దెబ్బలు తగిలాయని, కారును ముందుకి, వెనక్కి నడుపుతూ బీభత్సం సృష్టించారని అన్నారు. గంజాయి ఎక్కడపడితే అక్కడ ఫ్రీగా దొరుకుతుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వారిపై ఎలా అక్రమ కేసులు నమోదు చేయాలని ఆలోచిస్తుందేగానీ హాస్టళ్లలో వసతులు, గంజాయి నియంత్రణపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మాదిగ, గిరిజన కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు కందుల ఎజ్రా, పాలపర్తి వెంకటేశ్వరరావు, యువజన నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసి విన్నవించిన
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి