
పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 7,508 క్యూసెక్కులు ఆదివారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్ కి 316, బ్యాంక్ కెనాల్‌కు 1,791, తూర్పు కాలువకు 749, పశ్చిమ కాలువకు 281, నిజాపట్నం కాలువకు 487, కొమ్మూరు కాలువకు 2,980, బ్యారేజి నుంచి సముద్రంలోకి 77,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
6న జాబ్ మేళా
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న మంగళగిరిలోని వీటీజే ఎం – ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెస్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు జి.వి.ఎస్. సాయి కుమార్ – 80745 97926), షేక్ బాజీ – 77805 88993, పి.శ్రావణి – 93473 72996లను సంప్రదించాలని సూచించారు.
యజమానులకు
సెల్‌ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో రూ.50 లక్షల విలువైన 250 సెల్‌ఫోన్లను ఆదివారం యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 3,115 ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేశామని అన్నారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా లేదా 86888 31574 నంబర్‌కు, 1930 నేషనల్ సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ల ద్వారా అధికంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఫోన్లను అజాగ్రత్తతో పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు. ఐటీ కోర్ సీఐ నిషార్‌బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు.
దుర్గమ్మ సన్నిధిలో
భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహుర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల