
పింఛన్ల పంపిణీ పరిశీలించిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట రూరల్: పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. మండలంలోని కాకాని గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా సామాజిక ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ జేఎన్‌వీలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
చిలకలూరిపేట టౌన్: మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్ (11వ తరగతి) ప్రవేశాలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు ప్రకటించారు. సైన్స్, కామర్స్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. 2024–25లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందుకు అర్హులు అన్నారు. అలాగే 01.06.2008 నుంచి 31.07.2017 మధ్య జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కులను ఆధారంగా ఎంపిక చేసుకుని సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని, వాటిని ఆన్‌లైన్ jnvpanaduadmirrionr@mail.com నమోదు చేయడం గానీ లేదా ప్రత్యక్షంగా విద్యాలయానికి వచ్చి ఇవ్వవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.
కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు
రేపల్లె: 2024–25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన కాపు విద్యార్థులకు ఈ నెల 22న రేపల్లె పట్టణంలో జరిగే వార్షిక సమావేశంలో ప్రతిభా పురస్కారాలు అందించటం జరుగుతుందని కాపు సేవా సమితి నాయకులు కె.శివశంకరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో 500ల మార్కులుపైగా సాధించిన, ఇంటర్మీడియెట్, ఆపై చదువులలో 85 శాతం మార్కులు సాధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుకుంటున్న విద్యార్థులకు నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. విద్యార్థులు తమ మార్కుల జాబితా, ఆధార్, పూర్తి వివరాలతో కాపు సేవా సమితికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 82478 94595 నంబరులో సంప్రదించాలన్నారు.
వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ నియామకం
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ మస్తాన్‌ను వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేవలం రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఫ్రీడమ్
నరసరావుపేట: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సరికొత్త ఫ్రీడం ప్లాన్, కేవలం రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబి డేటా, రోజుకు 100 మెసేజ్‌లు, ఉచిత సిమ్‌కార్డు ఇవ్వబడుతుందని గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ సేవా కేంద్రాన్ని
సంప్రదించాలని కోరారు.