
వైఎస్సార్ సీపీ కార్యకర్తకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లి మండలం అబ్బురు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బాదరబోయిన వెంకటేశ్వర్లు (బుజ్జి) పై అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టుకు హాజరపరచగా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సృజన్‌కుమార్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బురు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త పెద్దింటి నాగరాజు, వైఎస్సార్ సీపీ కార్యకర్త బాదరబోయిన వెంకటేశ్వర్లు (బుజ్జి) ఇటీవల ఫోన్‌లో దూషించుకున్నారు. దీనిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశాడు. దూషణ కేసులో పెద్దగా శిక్ష పడదని భావించిన అధికార పార్టీ నాయకులు గ్రామానికి చెందిన పులబోలు బ్రహ్మయ్య అనే వ్యక్తి చేత తప్పుడు కేసు పెట్టించారు. తన వెంట గొడ్డలి తీసుకొని చంపుతానంటూ వెంకటేశ్వర్లు వెంట పడ్డాడంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో వెంకటేశ్వర్లు పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరించి రూ. 15 వేలు వ్యక్తిగత పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేశారు.
రెండు లారీలు ఢీకొని డ్రైవర్లకు గాయాలు
వినుకొండ: వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు... తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. వాటిని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికు లు 108కి సమాచారం తెలపడంతో గాయపడిన డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా ప్రమాదానికి గురైన వాహనాలను తరలించారు.