
మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యత తెలియచేయండి
ఆరోగ్యసిబ్బందికి సూచించిన డీఎంహెచ్‌ఓ
నరసరావుపేట: జిల్లాలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అన్నీ గ్రామాల్లో గల గర్భవతులు, బాలింతలు, ఇతర మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలియచేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి విభాగంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించి బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి డాక్టర్ ప్రసూన, ఆర్‌ఎంఓ వెంకటరావు, విజయలక్ష్మి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ హనుమకుమార్, జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.
కేంద్రియ విద్యాలయలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరం
నాదెండ్ల:ఇర్లపాడు పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయలో శుక్రవారం భారత స్కౌ ట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో తృతీయ సోపాన్ పరీక్ష శిబిరం 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణలోని 26 కేంద్రియ విద్యాలయాల నుంచి స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు జరిగే శిబిరం తెలంగాణ విద్యార్థులతో కళకళలాడింది. ప్రిన్సిపల్ నీరజ్‌కుమార్ శ్రీవత్స, ఉపాధ్యాయులు ముందుగా ఘనస్వాగతం పలికారు. తొలిరోజు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్నేహపూర్వక ప్రయాణం అంశాలపై కార్యక్రమం జరిగింది. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా, సిబ్బంది క్యాంప్ కిట్లు అందించారు. అనంతరం స్కౌట్స్ పెట్రోల్స్, మార్చ్‌ఫాస్ట్, స్వాగత నృత్యం ఆకర్షించాయి. క్వార్టర్ మాస్టర్ ఎస్.విజయ్‌కుమార్, ఎల్‌వోసీ రమేష్‌బాబు నాయకత్వం, సమాజసేవ, జీవిత నైపుణ్యాలను వివరించారు.