
ముందస్తు జాగ్రత్తలతో డెంగీ నివారణ
సత్తెనపల్లి: ముందస్తు జాగ్రత్తలతో దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, చికున్ గున్యా, మలేరియా, బోద , మెదడువాపు వ్యాధులను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ తో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు దోమలు పుట్టకుండా అలాగే కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మురుగునీరు ప్రవహించేటట్లు చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను పరిశీలించి సూచనలు చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ దోమలను నివారించాలంటే నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి ఆరబెట్టి మళ్లీ నీరు పట్టుకోవాలని, (ఫ్రైడే డ్రై డే పాటించాలని), పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ దోమ తెరలు వాడుకోవాలన్నారు. పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ పి గౌతమి ఆధ్వర్యంలో బావులలో, నీటి కుంటల్లో దోమ లార్వాలను తినే గంబుషియా చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ సుభాన్ బేగ్, ఆరోగ్య విస్తరణాధికారి పిట్టల శ్రీనివాస రావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండీ రెహమాన్, ఎమ్‌ఎల్‌హెచ్‌పీ వైశాలి, ఆరోగ్య కార్యకర్తలు పి.సౌరితేజ, జి నరసింహారావు, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి