
శావల్యాపురం మండలం కారుమంచి గ్రామ శివారులోని సపోటా తోటలో పేకాటరాయుళ్లను పట్టుకున్న శావల్యాపురం ఎస్ఐ ఎల్ లోకేశ్వరావు (ఫైల్)
కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రాంతాల్లో వెలసిన జూద కేంద్రాలు
తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో బరుల నిర్వహణ
ఆదాయ మార్గంగా పేకాట శిబిరాలు నిర్వహించాలని అనుచరులకు ప్రజాప్రతినిధుల సూచన
మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, గురజాలలో పెద్దఎత్తున నిర్వహణ
జిల్లా కేంద్రం నరసరావుపేటలో హోటళ్లు, అపార్టుమెంట్లలో పేకాట
ప్రతి రోజూ రూ.కోట్లలో చేతులు మారుతున్న వైనం
రోడ్డున పడుతున్న కుటుంబాలు
చూసీచూడనట్టు వదిలేస్తున్న పోలీసు యంత్రాంగం
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో జోరుగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా పేకాట మూడు జోకర్లు... ఆరు షోలుగా వర్దిల్లుతోంది. డైమండ్ రాణి, ఇస్పేట్ ఆసు అంటూ రేయింబవళ్లు పేక ముక్కల సందట్లో జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. అధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జూదశిబిరాలు కావడంతో సమాచారం ఉన్నా పోలీసులు ఆ వైపు తొంగిచూడటం లేదు. ముఖ్యంగా నరసరావుపేట, మాచర్ల, చిలకలూరిపేట, దాచేపల్లి, గురజాల, వినుకొండ పట్టణాల పరిధిలో పేకాట జోరుగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రం, జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు భారీగా తరలివస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జూదం పడగవిప్పింది. ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
జోరుగా పేకాట శిబిరాలు
జూదగాళ్లు పల్నాడు, ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాలలో జోరుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ పరిఽధిలోని మారు మూల ప్రాంతాల్లో నిత్యం పేకాట జరుగుతుండగా, వీటికి పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కార్లలో వచ్చి పేకాటలో పాల్గొంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పేకాట జోరుగా సాగుతోంది. వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, సాగర్ పోలీసుస్టేషన్లతోపాటు ఏకంగా మాచర్ల పట్టణంలో ప్రత్యేకంగా గదులు తీసుకొని పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. అచ్చంపేట, బెల్లంకొండ ప్రాంతాలలో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో అయితే అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. చిలకలూరిపేటలో ప్రజాప్రతినిధి అండదండలతో పట్టణ నడిబొడ్డులో ఏకంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటుగా యడ్లపాడు, బోయపాలెం, సాతులూరు, కోమటినేనివారిపాలెం, కావూరు గ్రామాలలో ద్వితీయ శ్రేణి నాయకులు జూద శిబిరాలను ఏర్పాటు చేశారు. రాజుపాలెం, పాకాలపాడు గ్రామాలలో పేకాట రాయుళ్ల కదిలికలు ఉంటున్నాయి. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. ఒక రోజు గురజాలలో పేకాట నిర్వహిస్తే మరో రోజు దాచేపల్లి మండల పరిధిలో మకాం మారుస్తున్నారు. ఉదయం 6 గంటలకు జూదగాళ్లకు ఆ రోజు పేకాట నిర్వహించే ప్రాంతాలను తెలియజేస్తున్నారు. దీంతో ఖరీదైన కార్లలో అక్కడ వాలిపోతున్నారు. ప్రజాప్రతినిధి ఆదేశాలు, నిర్వాహకులు ఇస్తున్న ముడుపులతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
అనుచరులకు ఆదాయ మార్గంగా
టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పేకాటను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మద్దతుతో యథేచ్ఛగా జూదశిబిరాలు నిర్వహిస్తున్నారు. పేకాటలో పా ల్గొనే వారి నుంచి ఒక్కో షోకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఒకరోజు శిబిరం నిర్వహిస్తే నిర్వాహకులకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రజాప్రతినిధికి కొంత, పోలీసులకు మరికొంత ముట్టజెబుతున్నామంటూ నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. అధికారు లు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దిద్దుబాటు చర్యలలో భాగంగా ఇటీవల జిల్లాలో అక్కడక్కడా పేకాట శిబిరాలపై దాడులు చేసి పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పేకాట శిబిరాలపై పూర్తి అవగాహన ఉన్నా అలసత్వం వహిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటు పడి పేకాట శిబిరాలకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు లేకపోలే దు. ఏదీ ఏమైనప్పటికీ జూదానికి అలవాటుపడ్డ వారి కుటుంబాలు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి రోడ్డుపడ్డాయి. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయి.
ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే...
పేకాట శిబిరాలు గతంలో చెట్లు, గుట్టల కింద గుట్టుగా జరిగేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లాడ్జిలు, ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న ఇళ్లలో జూదం నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నరసరావుపేటలో పేకాట సంస్కృతిని తీసుకువచ్చారు. విచ్చలవిడిగా జూద శిబిరాలను ఏర్పాటుచేసి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. బరంపేట, అల్లూరివారిపాలెం, ములకలూరు, ఎల్టీ నగర్, యలమంద తదితర ప్రాంతాలతో కలిపి ఒక నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోనే పదికి పైగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. కొన్ని హోటళ్లలో నిర్వాహకులు గదులు తీసుకొని పేకాట టేబుళ్ల ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ఆహారం, మందు సరఫరా చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వ్యవహారం నడుస్తోంది. జిల్లాలోని పేకాటరాయుళ్లకు నరసరావుపేట నిర్వాహకులు ఫోన్లు చేసి ఆహ్వానం పలుకుతున్నారు.

చింతపల్లి గ్రామ శివారులోని పేకాట అడుతున్న వారిని తమ సిబ్బందితో కలసి పట్టుకున్న ఎస్ఐ ఎం వాసు (ఫైల్)

అమరావతిలోని ఓ లాడ్జిలో పేకాటరాయుళ్లను పట్టుకున్న సీఐ వై అచ్చయ్య (ఫైల్)

పేకాట జోరు