పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
జిల్లా ఖజానాధికారి కె శ్రీనివాసరావు
మాచర్ల రూరల్: సమస్యల పరిష్కారానికి ట్రెజరీ శాఖ పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని జిల్లా ఖజానా శాఖాధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్స్‌కు, కుటుంబ సభ్యులకు అనేక సమస్యలున్నాయని, వారు ప్రతిసారీ కార్యాలయానికి రావటానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని తాము గుర్తించామని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ సబ్ ట్రెజరీ అధికారి పెన్షనర్స్ దగ్గరకు వచ్చి సమావేశం నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా తాము కృషి చేస్తామన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గాదె రామకృష్ణారావు మాట్లాడుతూ కుటుంబ పెన్షనర్‌లు క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలులో జరుగుతున్న రికవరీ గురించి ఆందోళన చెందుతున్నారని, వాటిని సానుకూలంగా పరిష్కరించాలన్నారు. స్థానిక అసోసియేషన్ అధ్యక్షులు నందా నరసింహయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామనాథశర్మ, సబ్ ట్రెజరర్ అధికారి రామానాయక్, పెన్షనర్స్ సంఘ నాయకులు గాలీబ్, కోటయ్య, నాసరయ్య, చంద్రయ్య, గౌస్ మొహిద్దిన్, రఘుపతిరావు, అంజయ్య, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.


