తుమృకోట అర్చక ఇనాము భూములకు విముక్తి
తుమృకోట(రెంటచింతల): మండలంలోని తుమృకోట గ్రామంలోని ఆలయాలకు చెందిన 56 ఎకరాల అర్చక ఇనాములకు రైతుకూలీ సంఘం వారి నుంచి విముక్తి లభించినట్లు ఏపీ అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి అన్నారు. మంగళవారం తుమృకోట గ్రామంలో ఆయా ఆలయాలకు చెందిన భూములకు చెందిన పత్రాలను అర్చకులకు అందచేసి మాట్లాడారు. శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ జనార్ధన స్వామి ఆలయం, శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాలకు చెందిన అర్చకమాన్యం భూములను గత మూడు సంవత్సరాల నుంచి రైతు కూలీ సంఘం వారు సాగుచేసుకుంటూ ఎలాంటి కౌలు చెల్లించలేదన్నారు. దీంతో మండల ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో కలిసి వారి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకుని రైతులకు కౌలుకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ భూములకు మొదటి సంవత్సరం రూ.5 వేలు, రెండవ సంవత్సరం రూ. 5,500, మూడవ సంవత్సరం రూ. 6 వేలుగా నిర్ణయించి ఈ కౌలును వారు ప్రతి ఏటా మే నెలాఖరులోపు చెల్లించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు గొట్టిపాళ్ల కృష్ణమాచార్యలు, అర్చకులు చిట్టేల మల్లిఖార్జున శర్మ, రైతులు పాల్గొన్నారు.
ఏపీ అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రామలింగేశ్వర శాస్త్రి


