
సత్తెమ్మ తల్లి దేవాలయంలో చోరీ
అచ్చంపేట: మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధి అడవిమధ్యలో గల సత్తెమ్మతల్లి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఆలయం చుట్టూ అమర్చిన ఆరు సీసీ కెమెరాలను పగులకొట్టారు. గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారి వెండి కిరీటం, శెట గోపురం, భక్తులు సమర్పించిన బంగారు ఆభరాలు దోచుకున్నారు. గర్భాలయంలోని ప్రధాన హుండీ, ఆలయంలో అక్కడడక్కడా అమర్చిన మరో నాలుగింటిని తవ్వి ఎత్తుకుపోయారు. అడవి మధ్యలో పగలకొట్టి అందులో నాలుగు నెలలుగా భక్తులు సమర్పించిన కానుకల్ని దోచుకుని అడవిలోనే వదలి పరారయ్యారు. చోరీకి గురిన మొత్తం రూ.6లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆలయ ప్రధాన పూజారి అమ్మవారికి నేవేద్యం పెట్టేందుకు బుధవారం ఉదయాన్నే దేవాలయానికి వచ్చాడు. తలుపులు తెరచి ఉండటం చూసి నివ్వెరపడిపోయాడు. వెంటనే దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డికి, అచ్చంపేట పోలీసుకు సమాచరం అందించారు. ఈవో ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి డీఎస్పీ గురునాథబాబు, అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. గుంటూరు నుంచి క్లూస్ టీం, నర్సరావుపేట నుంచి స్పెషన్ టీంలు అన్వేషణ ప్రారంభించాయి. అడవిలో అక్కడక్కడా పగలగొట్టబడి ఉన్న హుండీలను స్వాధీనం చేసుకున్నారు.
ఆరు లక్షల విలువైన ఆభరణాలు, హుండీ ఆదాయం దోపిడీ సీసీ కెమెరాలు పగలకొట్టి గర్భగుడిలోకి చొరబడిన దుండగులు