సహాయక చర్యలకు దళాలు సిద్ధం

భువనేశ్వర్: భారత వాతావరణ విభాగం జారీ చేస్తున్న సమాచారం మేరకు యాస్ తుపానుతో బాలాసోర్ జిల్లా ప్రధానంగా ప్రభావితమవుతుంది. పొరుగు జిల్లా భద్రక్‌పై కూడా తుపాను ప్రభావం పడవచ్చు. తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని, తుపానుకు ముందు, తర్వాత కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) యశ్వంత్ జెఠ్వా ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన బాలాసోర్ జిల్లాను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు.
బాలాసోర్ జిల్లాలో 40 లోతట్టు గ్రామాల్ని గుర్తించి కచ్చా ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించేందుకు 1,200 శాశ్వత, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం బాలాసోర్ జిల్లాకు అత్యధికంగా 12 యూనిట్ల ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్) జవాన్లను పంపారు. వారితో పాటు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), అగ్ని మాపక దళం జవాన్లు కూడా చేరుకుంటారు. కోవిడ్-19 నిబంధనలతో వారంతా తుపాను అనంతర పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లపై బాలాసోర్ జిల్లా ఐజీ, ఎస్పీ ఇతర సీనియర్ అధికారులతో శాంతిభద్రతల అదనపు డీజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
ఆధునిక యంత్రాలతో పునరుద్ధరణ
తుపాను తదనంతర పునరుద్ధరణ కార్యకలాపాలు చేపట్టేందుకు రోడ్లు–భవనాల శాఖ 165, గ్రామీణ అభివృద్ధి విభాగం 313 ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాల్ని రంగంలోకి దింపాయి. వారంతా అత్యాధునిక సహాయక, పునరుద్ధరణ యంత్ర పరికరాలతో సహాయక, పునరుద్ధరణ పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 కోట్లు విలువ చేసిన యంత్రపరికరాల్ని కొనుగోలు చేసింది. వాటిలో టవ ర్ లైట్లు, సెర్చ్ లైట్లు, జనరేటర్లు, జేసీబీలు, హైడ్రా క్రేనులు, ఇన్‌ఫ్లేటబుల్ పడవలు, హై హ్యాండ్ హైడ్రాలిక్ చెట్టు కోత యంత్రాలు, గ్యాసు కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, సాట్ ఫోన్లు, వాకీటాకీలు ఉన్నాయి. ఈ ఆధునిక సామగ్రితో యాస్ తుపాను కార్యకలాపాలు చేపడతారని శాంతిభద్రతల అదనపు డైరెక్టరు జనరల్ యశ్వంత్ జెఠ్వా మీడియాకు తెలిపారు.