రాయగడ: వంశధార జల వివాదం నేపథ్యంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ సూపర్‌వైజరీ కమిటీ మూడు రోజుల పర్యటనలో భాగంగా వంశధాన నదికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను గురువారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం(సిడబల్యూసీ) మహానది, ఈస్టర్న్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్, వంశధార జలవివాద ట్రిబ్యునల్ సూపర్‌వైజరీ కమిటీ చైర్మన్ జి.నాగమోహన్ నేతృత్వంలో ఈ పర్యటన కొనసాగింది. కమిటీ సభ్యులు కాట్రగడ సైడ్‌వియర్, ప్లడ్‌ఫ్లో కెనాల్‌తో పాటు ప్రతిపాదిత నేరడి బ్యారేజీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నీటి ప్రవాహం, నిర్మాణపరమైన అంశాలు, ఇతర సాంకేతిక విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ప్రాజెక్టు అధికారులతో కలసి కాట్రగడ సైడ్‌వీయర్, ఫ్లడ్‌ఫ్లో కెనాల్, ప్రతిపాదిత నేరడి బ్యారేజీకి సంబంధించిన వివిధ సాంకేతిక అంశాలపై కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. అనంతరం గజపతి జిల్లా కలెక్టర్‌తో కూడా పలు అంశాలపై సమావేశమై చర్చించినట్లు సమాచారం.
షాహడ గ్రామంలో తీవ్ర అసంతృప్తి
కమిటీ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని కాట్రగడ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఒడిశాలోని షాహడ గ్రామం వద్ద గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వంశధార ప్రాజెక్టుల కారణంగా నష్టపోతున్న తమ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కమిటీని కోరారు. ప్రాజెక్టుల వల్ల తమకు కలుగుతున్న నష్టాలు, భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులపై గ్రామస్తులు తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిస్థితిని పరిశీలించేందుకు కాశీనగర్ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ పర్యనటలో ఆంధ్రప్రదేశ్, కేంద్ర జల సంఘం, నీటిపారుదల శాఖలతో పాటు ఒడిశా నీటిపారుదల శాఖకు చెందిన పలువురు సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
తదుపరి చర్యలక కీలకం
వంశధార జల వివాదం నేపథ్యంలో ప్రతిపాదిత నేరేడీ బ్యారేజీతో పాటు వివిధ ప్రాజెక్టు ప్రాంతాలను సూపర్‌వైజరీ కమిటీ పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత ప్రాజెక్టు అధికారులతో సాంకేతిక అంశాలపై చర్చించడం ద్వారా వివాదానికి సంబంధించిన తదుపరి చర్యలకు ఈ పర్యటన కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రాజెక్టుల వల్ల ప్రభావితమవుతున్న గ్రామాల ప్రజల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


