స్తంభించిన జనజీవనం | - | Sakshi
Sakshi News home page

స్తంభించిన జనజీవనం

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

ఒడిశా బంద్‌..

భువనేశ్వర్‌:

ఇండియా కూటమి పిలుపునిచ్చిన 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌తో గురువారం ఒడిశాలో సాధారణ జనజీవనం ప్రభావితమైంది. కాంగ్రెస్‌, మిత్రపక్షాల కార్యకర్తలు పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించి నిరసనలు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు చోటుచేసుకున్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో ఆందోళనకారులు రైల్‌ రోకో నిర్వహించారు.

మూడు ప్రధాన డిమాండ్లు

సవరించిన మైనింగ్‌ చట్టం–2026ను ఉపసంహరించుకోవడం, పాఠశాల పాఠ్యపుస్తకాల్లో తప్పులపై రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్‌ రాజీనామా చేయడం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, అరెస్టు చేయాలన్న డిమాండ్లతో కాంగ్రెస్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

100 మందికి పైగా అదుపులోకి

భువనేశ్వర్‌, కటక్‌ జంట నగరాల్లో 100 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. దేబదత్త సింగ్‌ తెలిపారు. బంద్‌ సందర్భంగా శాంతిభద్రతల కోసం భువనేశ్వర్‌లో 18, కటక్‌లో 14 ప్లాటూన్లతో మొత్తం 32 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో 200 మందికి పైగా పోలీసు అధికారులను కూడా విధుల్లో ఉంచారు.

బంద్‌ విజయవంతమైందన్న పీసీసీ

బంద్‌ విజయవంతమైందని ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ ప్రకటించారు. పలు జిల్లాలు, మండల ప్రధాన కార్యాలయాల్లో బంద్‌ ప్రభావం కనిపించిందని తెలిపారు. ప్రజల మద్దతు లభించిందని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో నిరసనలు, ప్రదర్శనలను మరింత విస్తతం చేసి తమ డిమాండ్ల సాధన కోసం మంత్రుల ఘెరావ్‌ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

రాయగడ: ఇండియా కూటమి పిలుపునిచ్చిన 12 గంటల రాష్ట్ర వ్యాప్త బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కపిలాస్‌ కూడలి వద్ద జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు భవాణీ శంకర్‌జెన్న ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎమ్మెల్యే కడ్రక మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో అంతా సహకరించారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, అతని అనుచరులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీఎం మోహన్‌ చరణ్‌ మాఝి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండొ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాలతో మాస్క్‌లను ధరించి నిరసన వ్యక్తం చేశారు.

గుణుపూర్‌లో...

జిల్లాలోని గుణుపూర్‌లొ సిపిఐ (ఎంఎల్‌) నాయకుడు తిరుపతి గొమాంగొ నేతృత్వంలొ బంద్‌ విజయవంతమైంది. బంద్‌ సందర్భంగా రాకపోకలు స్తంభించాయి.

పర్లాకిమిడిలో..

పర్లాకిమిడి: ఒడిశా బంద్‌ గజపతి జిల్లాలో విజయవంతమైంది. కాశీనగర్‌, పర్లాకిమిడి, మోహనలో సంపూర్ణంగా ప్రజలు దుకాణాలు, మార్కెట్‌ను మూసి వేశారు. ఉదయం పర్లాకిమిడిలో చిల్లర దుకాణాలు, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, ఇతర బాలికల పాఠశాలలను కాంగ్రెస్‌ శ్రేణులు మూయించారు. దీంతో మోహన, లుహాగుడి వద్ద అనేక వాహనాలు నిలిచిపోయాయి. పర్లాకిమిడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు రాలేక పోయాయి. పర్లాకిమిడిలో సీపీఎంఎల్‌ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు నుంచి హైస్కూల్‌ జంక్షన్‌ వరకూ సీపీఎం ఎంఎల్‌ కార్యదర్శిఆధ్వర్యంలో కేదార్‌ శోబోరో ర్యాలీ జరిపారు. అనంతరం ఆయన హైస్కూల్‌ జంక్షన్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ దేశంలో 13.5 కోట్ల ఓట్లు సర్‌ ప్రక్రియతో గల్లంతయ్యాయని, దీన్ని రద్దు చేయాలని, అలాగే రాష్ట్రంలో స్వార్థ విరోధి, ఆదివాసీ విరోధి అయిన డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఖనిజ సంపదను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేయడం వంటి బిల్లును రద్దు చేయాలని డిమాండు చేశారు.

మల్కన్‌గిరిలో..

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. గురువారం ఉదయం నుంచే బంద్‌ ప్రభావం కనిపించింది. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, పుస్తకాల్లో తప్పులకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement