మలిగుడలో రైల్వే జీఎంపర్యటన | - | Sakshi
Sakshi News home page

మలిగుడలో రైల్వే జీఎంపర్యటన

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

రాయగడ: దెబ్బతిన్న మలిగుడ రైల్వే మార్గాన్ని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌ పంక్వాల్‌ బుధవారం సందర్శించారు. భూస్థలనం కారణంగా దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ పునరద్ధరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ రాజేష్‌ శఖావత్‌, రాయగడ డివిజనల్‌ మేనేజర్‌ అమితాబ్‌ సింఘాల్‌తో పాటు నిర్మాణ విభాగం ఉన్నతాధికారులు, డివిజినల్‌ అధికారులు ఉన్నారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే అధికారులు 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగిస్తూ దెబ్బతిన్న రైల్వే మార్గాన్ని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి చేపడుతున్న చర్యలను జీఎంకు వివరించారు. మలిగుడ రైల్వేబ్రిడ్జి సమీపంలోని 215–17 నుంచి 215–26 వరకు, అలాగే మలిగుడ స్టేషన్‌ యార్డులో 217–25 నుంచి 217 –36 వరకు భూస్థలనం కారణంగా రైల్వే మార్గం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ ప్రాంతంలో ప్రాథమిక వైద్య సదుపాయాలతో మెడికల్‌ హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రాత్రివేళల్లోనూ పనులు నిరంతరాయంగా కొనసాగించేందుకు కార్మికులకు తగిన ఆహారం, పునరుద్ధరణ ప్రాంతాల్లో సరైన లైటింగ్‌ సదుపాయాలు కల్పించాలని జీఎం సూచించారు.

రూ.5 కోట్లతో

హిర్లి డొంగురు అభివృద్ధి

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ఉన్న హిర్లి డొంగురు పర్వతాన్ని రూ.5 కోట్ల వ్యయంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జిల్లా ప్లానింగ్‌ బోర్డు చైర్మన్‌, నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి ప్రకటించారు. గురువారం హిర్లి పర్వతంపై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పర్వతం పైకి వెడల్పు రహదారి, వ్యూ పాయింట్‌ భవనం, విద్యుత్‌, తాగునీరు, పార్క్‌, మరుగుదొడ్లు, ఉద్యానవనం, అతిథి గృహం తదితర నిర్మా ణాలు జరుగుతాయని ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మహేశ్వర్‌ స్వయ్‌, ప్లానింగ్‌ బోర్డు కార్యదర్శి సురేష్‌ శాస్త్రి పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణకు

ముందే బదిలీ

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా రానున్న అన్యదాస్‌ బాధ్యతల స్వీకరణకు ముందే బదిలీ అయ్యి సంచలనం సృష్టించారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ కార్యదర్శిగా ఉన్న అన్యదాస్‌ని నబరంగ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి హైడ్రామా జరిగి అధికార పార్టీ నాయకులు ఆమెని నబరంగ్‌పూర్‌ జిల్లాకి రాకుండా అడ్డుకున్నారు. వెంటనే ప్రభుత్వం ఆమెని నువాపడా జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో అన్యదాస్‌ నబరంగ్‌పూర్‌ డీఆర్‌డీఏ పీడీగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులతో వివాదం జరిగింది. అప్పట్లో ఆమెకి వ్యతిరేకంగా బీజేపీ నబరంగ్‌పూర్‌ బంద్‌ నిర్వహించింది. ఈ నేపథ్యంలో తిరిగి అన్యదాస్‌ని నబరంగ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించడంతో పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. వెనువెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అన్యదాస్‌ని నువాపడా కలెక్టర్‌గా బదిలీ చేయించారు. మరోవైపు నబ రంగ్‌పూర్‌ కలెక్టర్‌గా మధుస్మితని ప్రభుత్వం నియమించింది.

విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దు

భువనేశ్వర్‌: క్యాంపస్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జాజ్‌పూర్‌లోని వ్యాసనగర్‌ అటానమస్‌ కళాశాల విద్యార్థి సంఘ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికల కమిటీ, అకడమిక్‌ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల ప్రకటించింది. తదు పరి ఉత్తర్వులు వెలువడే వరకు కళాశాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు శుక్రవారం ఉదయం లోగా హాస్టళ్లను ఖాళీ చేయా లని ఆదేశించింది. ఇదిలా ఉండగా, జాజ్‌పూర్‌ జిల్లాలోని ఖైరాబాద్‌ ముగ్‌పాల్‌లో ఉన్న యూఎన్‌ఎస్‌ మహావిద్యాలయం కూడా క్యాంపస్‌లో +3 విద్యార్థి సంఘ ఎన్నికలను రద్దు చేసింది. క్యాంపస్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బోధనా, బోధనేతర సిబ్బంది సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఎన్నికలను రద్దు చేసినట్లు కళాశాల ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement