పర్లాకిమిడి: కాశీనగర్, గుణుపురం సబ్‌డివిజన్ల మధ్య వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నేరడి సాగునీరు, తాగునీటి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దండకారణ్య అభివృద్ధి ప్రచార స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వంశధార ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న గజపతి జిల్లాలో కాశీనగర్, గుణుపురం సబ్ డివిజన్‌ను సందర్శించడానికి విచ్చేయునున్న టెక్నికల్ కమిటీ పర్యటన రద్దు చేయాలని దండకారణ్య అభివృద్ధి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గౌర చంద్ర త్రిపాఠి కోరుతున్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు నేరడి బ్యారేజి నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. నేరడి వద్ద వంశధార నదిపై ప్రాజెక్టు నిర్మిస్తే గజపతి జిల్లా కాశీనగర్ వంశధార పరివాహక ప్రాంతంలో ఏడు గ్రామాలు, రాయగడ జిల్లా గుణుపురం సబ్ డివిజన్‌లో 106 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా భుభనేశ్వర్‌లో దండకారణ్య డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ గౌరచంద్ర త్రిపాఠి వంశధార నదీ జలాల వివాద ట్రిబ్యునల్, చైర్మన్ సూపర్‌వైజర్ కమిటీ అధ్యక్షులు జి.నందమోహన్ ఈస్ట్రన్, మహానది సెంట్రల్ వాటర్ కమిషన్, సెక్రటరీ ఆదిత్య ఎస్‌ఎస్ బులియాను ఇటీవల కలిశారు. వంశధార పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న రైతులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారని, వారికి న్యాయం చేయాలని ఒడిశా నదీజలాల వివిద ట్రిబ్యునల్ అధికారులను, ఒడిషా ప్రభుత్వ టెక్నికల్ బృందాన్ని కోరుతున్నారు. వంశధార నదిపై నిర్మించనున్న నేరడి ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలు, రైతులకు పునరావాస ప్యాకేజిని ఇవ్వాలని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝికి కూడా ఒక లేఖను రాశారు. గజపతిజిల్లా కాశీనగర్ బ్లాక్ వంశధార పరివాహక ప్రాంతంలో నివశిస్తున్న బూదర, వన్న, గౌరి, ఖరడ గ్రామాల ప్రజలు ఇప్పటికే పలు దఫాలు నిరసన వ్యక్తం చేశారు. కాశీనగర్ ప్రాంత రైతాంగంను ఆదుకుని వారి న్యాయమైన డిమాండ్లను ఏపీ ప్రభుత్వం పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోవాలని జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి డిమాండ్ చేస్తున్నారు.


