కొరాపుట్‌ జిల్లాలో ముగ్గురు వలస కార్మికులు మృతి | - | Sakshi
Sakshi News home page

కొరాపుట్‌ జిల్లాలో ముగ్గురు వలస కార్మికులు మృతి

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

కొరాపుట్‌ జిల్లాలో ముగ్గురు వలస కార్మికులు మృతి

కొరాపుట్‌: పొట్టకూటి కోసం వెళ్లిన ముగ్గురు వలస కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారు. కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌ సమితి కక్కిరిగుమ్మ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పంచాడా గ్రామానికి చెందిన తంగు జానీ (30), మెఘా జానీ (27) మృతి చెందారు. దిబా జానీ (29) విశాఖపట్నంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ గ్రామానికి చెందిన సుమారు 10 మంది యువకులు మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ధన్య శ్రీ కేష్‌ గ్రానైట్‌ పరిశ్రమలో పని చేయడానికి వెళ్లారు. అక్కడ ధూళి, కాలుష్యం వల్ల వీరంతా అనారోగ్యం పాలయ్యారు. దాంతో వీరంతా ఇంటి బాట పట్టారు. అనారోగ్యం పాలైన వారిలో జిత్తు జాని అనే యువకుడు ప్రస్తుతం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. గతంలో మరో ఇద్దరు యువకులు కూడా పరిశ్రమ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోనికి రావడంతో జిల్లా అధికారులు ఆ గ్రామానికి తరలి వెళ్లారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మరణాలకు కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవడానికి వివిధ శాఖల మద్య సమన్వయం జరుగుతుంది. ఈ సంఘటన తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొరాపుట్‌ పార్లమెంట్‌ సభ్యుడు సప్తగిరి ఉల్క బాదిత గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలు వెల్లడించిన వివరాలు నమోదు చేసుకున్నారు. చట్టపరంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే పవిత్ర శాంత బాధిత గ్రామానికి వెళ్లారు. ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. అనారోగ్యం పాలైన దిబాకర్‌ జానీ విశాఖ పట్నంలో మృతి చెందాడన్నారు. అతని మృతదేహం విడుదల చేయడానికి డబ్బులు బాకీ ఉన్నాడని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారన్నారు. వెంటనే తాను రు.85 వేలు ఫోన్‌ పే చేయగా విడుదల చేశారన్నారు. తాను పంపిన ఫోన్‌ ఫే వివరాలు మీడియాకి చూపించారు. రాష్ట్రంలో గిరిజన గ్రామాల్లో యువతకి ఉపాధి లేకుండా పోయిందన్నారు. దాంతో ఈ మరణాలు జరుగుతున్నాయన్నారు. తక్షణం ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement