ఎచ్చెర్ల: ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్ల డ్యూయల్ ఇంజినీరింగ్ (బీటెక్, ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికి ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఏయూఈఈటీ– 2026కు 330 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు 374 మందికి హల్‌టికెట్లు జారీ చేయగా 44 మంది గైర్హాజరయ్యారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు పర్యవేక్షించారు. ఎచ్చెర్లతో పాటు రాష్ట్రంలో మరో ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం ఉదయం కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావుకు వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు.
శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో మత్స్యశాఖ డైరెక్టర్
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరున్ని మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అర్చకులు ఆల చరిత్ర వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. ఈయనతోపాటు డీడీ గోపికృష్ణ, సిబ్బంది, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉన్నారు.
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
నరసన్నపేట: వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను పట్టుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్ ఆదివారం తెలిపారు. నారాయణవలస సంత వద్ద నుంచి అలమండ సంతకు ఎటువంటి అనుమతులు లేకుండా చిన్న వ్యాన్‌లోనే 9 ఆవులను ఎక్కించడంతో ప్రాణాపాయంగా కనిపించాయని చెప్పారు. తామరాపల్లి వద్ద వీటిని పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించి వ్యాన్ సీజ్ చేశామని ఎస్‌ఐ తెలిపారు.
నాటకరంగానికి చేయూతనివ్వాలి
శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా భరత్ భూషణ్ నియామకం పట్ల శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి మాట్లాడుతూ ఒడిదుడుకుల్లో ఉన్న నాటకరంగానికి, పేద కళాకారులకు చేయూతనందించాలని కోరారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి, కార్యదర్శి బి.రామచంద్ర దేవ్, న్యాయ సలహాదారు కంచరాన అప్పారావు, కార్యవర్గ సభ్యులు చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.


