మలిసంధ్యలో ఒకరికొకరై.. | - | Sakshi
Sakshi News home page

మలిసంధ్యలో ఒకరికొకరై..

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

భువనేశ్వర్‌:

తడికి ఎవరూ లేరు. కష్టం వచ్చినా.. కన్నీరు వచ్చినా తనకు తానే తోడు. మలి సంధ్య వరకు ఒంటరిగానే బతుకు నావ సాగించాడు. ఆమెకూ ఎవరూ లేరు. దుఖం వచ్చినా.. బాధ కలిగినా ఆమెను ఆమే ఓదార్చుకోవాలి. అతడికి 70 ఏళ్లు.. ఆమెకు 65 ఏళ్లు. కుటుంబాలకు దూరంగా కష్టాలకు దగ్గరగా బతుకుతూ.. ఒకరికొకరు పరిచయమయ్యారు. నా అనే తోడు లేని బతుకులో ఒకరికొకరుగా బతకాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి ప్రవేశించారు. బాలాసోర్‌ జిల్లాలో సంఘటన ఇది.

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా జలేశ్వర్‌కు చెందిన ఇద్దరు నిరుపేద వృద్ధులు వివాహ బంధంతో జీవనంలోకి పునః ప్రవేశించారు. ప్రేమకు వయసుతో గానీ, కష్టాలతో గానీ సంబంధం లేదని వీరి వివాహ బంధం నిరూపించింది. హతిగొడొ ప్రాంతానికి చెందిన 70 చైతన్య సోరెన్‌ కుష్టు వ్యాధి పీడితుడు. తన ఇంటికి, కుటుంబానికి దూరమై జలేశ్వర్‌ పట్టణంలో నివసిస్తున్నాడు. స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి తనలాగే ఇబ్బంది పడుతూ జీవనం సాగిస్తున్న రైబొణియా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల చంపా సోరెన్‌ పరిచయమైంది.

సాధారణ సంభాషణలతో మొదలైన వీరి పరిచయం క్రమంగా భావోద్వేగ బంధంగా వికసించింది. కుటుంబాలను వదిలి, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ ఒకరిలో ఒకరు ఓదార్పును, సాంగత్యాన్ని కనుగొని తమ జీవితాలను కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు.

వారి సంకల్పానికి భోలా భండారి స్వచ్ఛంద సంస్థ సహాయసహకారాలు అందజేసి అండగా నిలిచి ఆదరించింది. వారి వివాహానికి ఏర్పాట్లు చేసింది. జలేశ్వర్‌లోని పంచఘంట ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వర మహాదేవ్‌ ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో వివాహం ధూమ్‌ధామ్‌గా జరిగింది. పెళ్లి మండపంలో పూలమాలలు మార్చుకుని వృద్ధ ప్రేమ జంట గానా బజానా, విందు వినోదాల మధ్య నవ దంపతులుగా మారి కొత్త జీవనానికి శ్రీకారం చుట్టారు. ఈ అసాధారణ వివాహం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ హృద్యమైన వేడుకను వీక్షించేందుకు ఆలయం వద్ద గుమిగూడిన జనం సమక్షంలో నవ దంపతులుగా ఒక్కటైన చైతన్య, చంపా జీవితంలోని సవాళ్లలో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గౌరవంగా, శ్రద్ధగా కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement