శాసనసభకు నలుపు దుస్తులతో హాజరు
కటక్ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ
మంత్రి రాజీనామాకు డిమాండ్
భువనేశ్వర్: శాసనసభ వద్ద బుధవారం ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై విపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెసు సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం మారుమోగింది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు నల్లని దుస్తులు ధరించి నిరసన ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన, తీవ్ర నినాదాలతో సభాకార్యకలాపాలు ప్రభావితం అయ్యాయి. విపక్ష సభ్యులు నల్ల టీ షర్టులు ధరించి సభలోకి ప్రవేశించారు. కటక్ ఎస్‌ిసీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు వినూత్న రీతిలో చేపట్టిన నిరసన అధికార పక్షానికి ఇబ్బంది కలిగించింది. బలహీన ముఖ్యమంత్రి – బలమైన ఆరోగ్య శాఖ మంత్రి నినాదంతో రాసి ఉన్న టీ షర్టులు ధరించి ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకు నల్ల టీ షర్టులు ధరించి నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే బ్యోమకేష్ రాయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి ఆరోగ్య శాఖ మంత్రి అంటే భయమని ఎమ్మెల్యే రాజన్ ఎక్కా ఎద్దేవా చేశారు. 13 మంది ప్రాణాలు బలిగొన్న కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్రి ప్రమాదం సంఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


