భువనేశ్వర్: దీర్ఘ కాలం తర్వాత పూరీ శ్రీజగన్నాథుని వజ్ర, రత్న, వైడూర్య, బంగారు ఆభరణాల లెక్కింపు అనుబంధ జాబితా తయారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ముందస్తు నిర్ధారిత సుముహూర్త ఘడియల ప్రకారం ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు. 48 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. స్వామి రత్న భాండాగారంలోని ఆభరణాల జాబితా తయారీ పురస్కరించుకుని శ్రీమందిరం లోపల ప్రత్యేక నిపుణుల బృందం ఆలయం లోనికి ప్రవేశించింది. జాబితా తయారీ కోసం శ్రీమందిరం పాలక మండలి ప్రతిపాదించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌ఓపీ) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దీని ప్రకారం ఈ ప్రక్రియ ఆరంభించారు.
నిరంతరాయంగా దర్శనం..
అమూల్యమైన రత్న సంపద లెక్కింపు, జాబితా రూపకల్పన సందర్భంగా సాధారణ భక్తులకు నిరంతరాయ సర్వదర్శనం సౌకర్యానికి ప్రాధాన్యత కల్పించారు. మరోవైపు రత్న వేదికపై కొలువుదీరిన మూల విరాట్‌లు, ఇతర మూర్తుల దైనందిన నిత్య సేవాదులు, పూజల్లో ఎటువంటి అంతరాయం చోటు చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించారు.
జాబితా తయారీ ఇలా....
రత్న భాండాగారంలోని ఆభరణాల జాబితా అనంతరం ఆభరణాలను 1978 నాటి జాబితాతో సరిపోల్చి చూస్తారు. సరిపోల్చిన వివరాలతో వాటిని తూకం వేస్తారు. ఆభరణాలను గుర్తించడానికి ఇద్దరు రత్న శాస్త్రవేత్తలను నియమించారు. డిజిటల్ ఫొటోగ్రఫీ ఆభరణాల జాబితాకు ప్రత్యేక హంగుగా జోడిస్తారు. ఆభరణాలు గుర్తించి, లెక్కించి, తూకం వేసిన తర్వాత వస్తువులను 2, 3 పొరలలో చుట్టి ఒక పెట్టెలో భద్రంగా ఉంచుతారు. ఈ ప్రక్రియలో పసుపు, తెలుపు, ఎరుపు రంగు వస్త్రాల్ని వినియోగిస్తారు. 6 పెట్టెల్లో అమూల్య ఆభరణాలను పదిలపరుస్తారు. బంగారు ఆభరణాలను పసుపు రంగు వస్త్రంపై ఉంచి వరుస క్రమంలో పెట్టెలో పేర్చుతారు. వెండి ఆభరణాలను తెల్ల వస్త్రం చుట్టి భద్రపరుస్తారు. ఇతర ఆభరణాలను భద్రపరిచేందుకు ఎరుపు రంగు వస్త్రం వినియోగిస్తారు. ఈ లెక్కింపులో దేవాలయ ఆభరణాల ప్రముఖులు, ప్రభుత్వ బ్యాంకు ఆభరణాల నిపుణులు, రత్న శాస్త్రవేత్తలు, భారత రిజర్వు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించడంలో సేవకులు, అధికారులు , భక్తులు ఇలా అన్ని వర్గాల సహకారాన్ని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టర్ అరవింద్ కుమార్ పాడీ కోరారు.
భక్తుల ప్రవేశం యథాతథం..
రత్న భాండాగారం లెక్కింపు జరుగుతున్నప్పటికీ దేవుళ్ల పూజాదికాలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ కార్యకలాపాలతో ముడిపడిన అధీకృత సేవకులకు జగమోహన్, గర్భ గృహంలోనికి ప్రవేశించేందుకు అనుమతించారు. భద్రతా కారణాల దృష్ట్యా లోపలి గడప నుంచి భక్తులకు సర్వ దర్శనం నివారించి, వెలుపలి వాకిలి నుంచి రత్న వేదికపై మూల విరాట్‌ల దర్శనాన్ని పరిమితం చేశారు.


