ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 7:36 AM

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–3 ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. హెల్మెట్‌ ధరించడం, లైసెన్స్‌ కలిగి ఉండటం వంటి ట్రాఫిక్‌ నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్‌ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–3 పీవో డా.ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈనెల 29వ తేదీ వరకు శిబిరం కొనసాగనుంది.

ఆర్థిక సాయం అందజేత

శ్రీకాకుళం: జిల్లాలోని పంచాయతీ రాజ్‌ మినిస్ట్రీయల్‌ ఉద్యోగులు ఇటీవల మృతి చెందిన డీపీవో కార్యాలయ ఉద్యోగి కిషోర్‌ కుమార్‌ కుటుంబానికి తమ వంతు సాయం అందించారు. వీరంతా రూ.1,77,000ల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు కిల్లారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

దళితులపై దాడులు పెరిగాయి

గార: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్‌ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం గారలో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రికి చెందిన టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు దళిత మహిళపై హేయమైన మాటలు ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా దళితులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శాలిహుండంలో దళితులు 15 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వం పునరాలోచించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

హుండీ ఆదాయం లెక్కింపు

గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయ హుండీలను బుధవారం లెక్కించగా రూ.19,76,584లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో టి.వాసుదేవరావు తెలిపారు. ఆలయంలోని హుండీలతో పాటు సమీప పాతాళ సిద్ధేశ్వేర ఆలయ హుండీలను లెక్కించారు. 98 రోజులకు ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి టి.గురునాథం తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీహెచ్‌ సీతారామనృసింహాచార్యులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని నైరా, బట్టేరు గ్రామాల్లో మెడికవర్‌ ఆస్పత్రి సౌజన్యంతో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దంత, గుండె, పల్మనరీ, ఈసీజీ, గైనిక్‌ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా.జి.జోగినాయుడు, సర్పంచ్‌ అరవల రామ్‌ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

29న చెస్‌ పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్‌–9 బాలబాలికల చెస్‌ ఎంపిక పోటీలు ఈనెల 29వ తేదీన జరగనున్నాయని చెస్‌ ఇన్‌ స్కూల్‌ కమిటీ సభ్యుడు సనపల భీమారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం బలగ నుంచి రాగోలుకు వచ్చే కొత్తరోడ్‌ జంక్షన్‌ సమీపంలోని కశ్యప్‌ నర్సింగ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచినవారు త్వరలో జరగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 2017 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఈనెల 28వ తేదీలోగా క్రీడాకారులు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99125 59735 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

ఆలయ ప్రతిష్ట

రణస్థలం: మండలంలోని కోష్ట పంచాయతీ పరిధి పైడిపేట గ్రామంలో రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ పాల్గొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement