కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్ ఐఐసీ సంబిత్‌కుమార్ బెహరాకు డీజీపీ డిస్క్ మెడల్ లభించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్ర పొలీసు అవతరణ దినోత్సవం సందర్భంగా రాజధానిలో జరిగే కార్యక్రమంలో డీజీపీ ఈ అవార్డును బహూకరిస్తారు. విధి నిర్వహణలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన పోలీసులకు డీజీపి డిస్క్ మెడల్‌ను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా సంబిత్‌ను సహచర పోలీసులు బుధవారం అభినందించారు.
బాలుడి కిడ్నాప్‌కు యత్నం!
రాయగడ: పన్నెండేళ్ల బాలుడుని కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని దుండగుడు ప్రయత్నించాడని సదరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదయ్యింది. స్థానిక సాయిప్రియనగర్‌లో నివాసముంటున్న చందన్ విశ్వకర్మ 12 ఏళ్ల కొడుకు ఆయుష్ పనిమీద మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు స్కూటీపై వచ్చి బాలుడితో అడ్రాస్ అడిగే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడు అతని దగ్గర నుంచి చాకచక్యంగా తప్పించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన వారు సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడుతోపాటు అతని తల్లిదండ్రులతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఆధారంగా దుండగుని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సింగిపురంలో హనుమాన్ మందిర ప్రతిష్ట
పర్లాకిమిడి: జిల్లాలోని కాశీనగర్ బ్లాక్ సింగిపురం గ్రామంలో బుధవారం హనుమాన్ మందిర ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, బీజేపీ నాయకులు దారపు రాజేష్ కుమార్, సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, సర్పంచ్ తేజ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలుగా హనుమాన్ మందిర నిర్మాణాలు జరుగుతుండగా నేటికి ప్రాణప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. ఐదు రోజులు జరిగే మందిర ప్రతిష్టకు ఎమ్మెల్యే ల్యాడ్ నిధుల నుంచి రూ. 3 లక్షలు, నవీన్ పట్నాయిక్ ప్రభుత్వ హయాంలో రూ. 15 లక్షలు నిధులు అందజేశారు. ప్రతిష్టా మహోత్సవం అనంతరం అన్నప్రసాదాలు భక్తులకు అందజేశారు.
పర్లాకిమిడిలో ఈదురుగాలులు
పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం సాయంత్రం దట్టమైన మేఘాలతో ఈదురుగాలులు వీచాయి. రామగిరి, రాయఘడలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
నువాగుడలో రూటేజ్ స్మార్ట్ విలేజ్ ప్రారంభం
జయపురం : జయపురం సబ్ డివిజన్ కుంద్రా సమితి నువాగుడ గ్రామంలో ఎం.ఎస్.స్వామినాథన్ పరిశోధన కేంద్రం, జయపురం, నాబార్డ్ సంస్థలు సంయుక్తంగా రూటేజ్ స్మార్ట్ విలేజ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపుభొత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూటేజ్ స్మార్ట్ విలేజ్ అనేది కొత్త ఆలోచన అని, దీని ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ జ్ఞానం, నైపుణ్యాభివృద్ధిని ఆన్‌లైన్ సేవల ద్వారా అందుతుందన్నారు.


