ప్రకృతి వనరులు పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వనరులు పరిరక్షించాలి

Mar 11 2026 7:22 AM | Updated on Mar 11 2026 7:22 AM

కొరాపుట్‌: ప్రకృతి వనరులు పరిరక్షించాలని ఉద్యమకారుడు ప్రపుల్ల సామంత్రాయ్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సద్భావనా స్వగృహం ముందు ఆందోళన చేపట్టారు. గనులు, జలాలు, అడవులను దోచుకోవడాన్ని నిరసిస్తూ తాము యాత్ర చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 25న బాలేశ్వర్‌ జిల్లాలో ప్రారంభమైన యాత్ర, ప్రస్తుతం నబరంగ్‌పూర్‌, మల్కన్‌గిరి జిల్లాల మీదుగా కొరాపుట్‌ చేరుకుందన్నారు. మార్చి 29వ తేదీన భగత్‌సింగ్‌ బలిదాన దినోత్సవం రోజున ఈ యాత్ర ముగిస్తామన్నారు.

14న మిస్‌ ఉగాది పోటీలు

రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 19, 20వ తేదీల్లో స్థానిక కొల్లిగుడ సమీపంలోని మైదానంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఆ సమాఖ్య అధ్యక్షుడు యాల్ల కొండబాబు ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఉగాది ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగా ఈనెల 14వ తేదీన స్థానిక లయన్స్‌ క్లబ్‌ ప్రాంగణంలో నిర్వహించనున్న మిస్‌ ఉగాది–26 పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోటీలకు సంబంధించి 99388 82076, 70086 27973 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

దండ కారణ్య వికాస్‌ మహామంచ్‌ నేతలు ధర్నా

మల్కన్‌గిరి: స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట దండకారణ్య మహా వికాస్‌ నేతలు మంగళవారం ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా మహామంచ్‌ కన్వీనర్‌ గౌరచంద్ర త్రిపాఠి నేతృత్వంలో నిరసన తెలిపారు. తాము కూడా ఒడిశా ప్రజలమేనని.. తమపై కూడా దృష్టి సారించాలని కోరారు. అవిభక్త కొరాపుట్‌ ప్రాంతంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేశవ షడంగి, మనోజ్‌ కుమార్‌ పాత్రో, విజయ్‌కుమార్‌ పాత్రో, ఘేను ముదిలీ, శశిభూషన్‌ పట్నాయిక్‌, గుప్తేశ్వర్‌ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.

272 కిలోల గంజాయి స్వాధీనం

పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్‌ అడవ పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఖసిరిగుడ గ్రామంలో పోలీసులు ఒక ఇంటిపై దాడిచేసి 272 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని బ్రిందా నాయక్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేసి గంజాయి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఐఐసీ సుభ్రత్‌ పండా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement