మా ‘మన్‌ కీ బాత్‌’ వినండి | - | Sakshi
Sakshi News home page

మా ‘మన్‌ కీ బాత్‌’ వినండి

Mar 11 2026 7:22 AM | Updated on Mar 11 2026 7:22 AM

జయపురం: ప్రధాన మంత్రిజీ ‘మీ మన్‌ కీ బాత్‌’ చాలా విన్నాం.. ఇప్పుడు మా మనసు మాట వినండి, ఆకాశ వాణిని రక్షించండి–సంస్కృతిని కాపాడండి’ అని మాజీ మంత్రి, ప్రముఖ బీజేడీ నేత రబినారాయణ నందో అన్నారు. మంగళవారం ఆకాశవాణిని రక్షించండి–సంస్కృతిని పరిరక్షించండి అని డిమాండ్‌ చేస్తూ జయపురం ఆకాశవాణి భవనం ముందు పార్టీలకు అతీతంగా పలు పార్టీలు నేతలు సమైక్యంగా ఆందోళన చేపట్టారు. దండకారణ్యవికాస్‌ మహా మంచ్‌ పిలుపు మేరకు శ్రీసేవ్‌ ఆల్‌ ఇండియా రేడియో– సేవ్‌ కల్చర్‌శ్రీ నినాదంతో నేడు చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి నేతృత్వంలో ప్రధాన మంత్రి ని ఉద్దేశించిన మెమొరాండం జయపురం ఆకాశవాణి కేంద్రం అధికారికి అందజేశారు. అందులో ప్రొగ్రామ్‌ విభాగం ఉద్యోగులపై జరుగుతున్న వివక్షాత్మక వ్యవహారం, ప్రసార్‌ భారతి లో పెరుగుతున్న పాలనా అసమతుల్యతను తొలగించాలని డిమాండ్‌ చేశారు. 2014 లో సామ్‌ పిత్రోడా అధ్యక్షతన ఏర్పడిన ప్రసార భారతి పై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలో ప్రసార భారతిలో కేవలం 18.7 శాతం మంది మాత్రం కార్యక్రమాల రూపకల్పన వంటి ముఖ్య కార్యక్రమాలలో పని చేస్తుండగా 44.4 శాతంమంది ఇంజినీరింగ్‌ విభాగంలో ఉన్నారని వెల్లడించిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని సరిచేసి ప్రొగ్రాం విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మానవ వనరులు పునర్‌వ్యవస్థీకరించాలని కమిటీ సూచించిందన్నారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగెస్ట్‌ సంస్థ నిర్వహించిన మేన్‌పవర్‌ ఆడిట్‌లో కూడా కార్యక్రమాలకు సంబంధించిన ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సిఫార్సు చేసిందని వెల్లడించారు. జయపురం ఆకాశవాణి కేంద్రంలో 38 ఆమోదిత పోస్టులు ఉండగా నేడు మొత్తం కార్యక్రమాలు ఇద్దరు అనౌన్సర్లు మాత్రమే నిర్వహిస్తున్నారని, ఇది ఆకాశ వాణి భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రొగ్రాం విభాగానికి చెందిన ఉన్నత స్థాయి, మధ్య స్థాయి పదవులు ఇంజినీరింగ్‌ క్యాడర్‌ ఆధీనంలో ఉన్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరించి ఖాళీలను భర్తీ చేయాలని విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement