భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లాలో వరి సేకరణ సీజన్‌లో వేధింపులకు సంబంధించి ఒక రైతు మృతికి సంబంధించిన వివరాలను సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ సురమా పాఢి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించారు. అసెంబ్లీలో ఒక తీర్పును ప్రకటిస్తూ స్పీకర్, రైతు మరణానికి దారితీసిన పరిస్థితులు, ఈ సంఘటనపై నిర్వహించిన విచారణ ఫలితాలను సంబంధిత మంత్రి ప్రస్తుత సమావేశాలు ముగిసేలోపు సభకు తెలియజేయాలని అన్నారు. ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రస్తావించడంతో స్పీకరు ఈ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాపడా జిల్లా రాజ్‌నగర్ తహసీల్ జునాగొడి గ్రామానికి చెందిన త్రిలోచన్ నాయక్ అనే మృతుడు ఫిబ్రవరిలో రైస్ మిల్లు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురి అయ్యాడని ఆమె ఆరోపించారు. తాను పండించిన వరిని అమ్ముకునే ప్రయత్నంలో రైతు ఇబ్బందులు ఎదుర్కొని ఈ దురవస్థపాలయ్యాడని చీఫ్ విప్ పేర్కొన్నారు. పండించిన వరి అమ్మడానికి టోకెన్ జారీ చేసి వరిని ఒక ప్రైవేట్ రైస్ మిల్లుకు తీసుకెళ్లమని ఆదేశించారు. తదనుగుణంగా వరి విక్రయించేందుకు ప్రైవేటు బియ్యం మిల్లు ముంగిట 3 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి రైతు తన మొత్తం వరి నిల్వను అమ్మలేకపోయాడు. దీని వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురై చివరికి ప్రాణాలు వదిలాడని ప్రమీలా మల్లిక్ సభలో ఆరోపించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రూలింగ్ జారీ చేసి ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరాలని స్పీకరుకు అభ్యర్థించారు. బిజూ జనతా దళ్ శాసన సభ్యులు ధృబొ చరణ్ సాహు, గణేశ్వర్ బెహరా కూడా రైతు మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. వరి సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం నిర్వహించే మండీలలో నిర్వహణ లోపాలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.


