శాసన సభకు రాజ్య సభ బ్యాలెట్‌ బాక్సులు | - | Sakshi
Sakshi News home page

శాసన సభకు రాజ్య సభ బ్యాలెట్‌ బాక్సులు

Mar 11 2026 7:22 AM | Updated on Mar 11 2026 7:22 AM

శాసన సభకు రాజ్య సభ బ్యాలెట్‌ బాక్సులు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. పోటీ ఉప సంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఖరారయ్యారు. మరో వైపు పోలింగు కోసం అవసరమైన బ్యాలెటు బాక్సు మంగళ వారం శాసన సభకు చేరింది. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రాజ్య సభ ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. పోటీ ఉప సంహరణ గడువు పూర్తయిన నామినేషను దాఖలు చేసిన అభ్యర్థులు అందరూ పోటీ కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. 4 రాజ్య సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌, సిటింగు రాజ్య సభ సభ్యుడు సుజీత్‌ కుమార్‌, విపక్ష బిజూ జనతా దళ్‌ తరపున సంతృప్త్‌ మిశ్రా, ఉమ్మడి అభ్యర్థిగా డాక్టరు దత్తేశ్వర్‌ హత్తా, స్వతంత్ర అభ్యర్థిగా దిలీప్‌ రే పోటీలో ఉన్నారు. 4వ స్థానం కోసం పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఈ స్థానం కోసం ఉమ్మడి అభ్యర్థి డాక్టరు దత్తేశ్వర్‌, స్వతంత్ర అభ్యర్థిగా దిలీప్‌ రే మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ మద్దతుతో దిలీప్‌ రే గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. విపక్ష బిజూ జనతా దళ్‌, కాంగ్రెసు మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా డాక్టరు దత్తేశ్వర్‌ విజయం కోసం ఆరాటపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో 4వ స్థానం పోలింగులో క్రాస్‌ ఓటింగు ప్రమాదం పొంచి ఉన్నట్లు సర్వత్రా చర్చ సాగుతుంది. ప్రధానంగా కాంగ్రెసు పార్టీలో క్రాస్‌ ఓటింగు పట్ల అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ రాజ్య సభ ఎన్నికల పోలింగు ఏజెంట్‌గా వ్యవహరిస్తారని పార్టీ వర్గాల సమాచారం. క్రాస్‌ ఓటింగ్‌ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement