జయపురం: ఉద్యోగ విరమణ రోజునే పూర్తి పెన్షన్‌ను అందుకున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు. జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విద్యా విభాగ కార్యాలయం పరిధిలో కుందారిగుడ పాశాలలో పనిచేస్తున్న సుప్రభా పాడీ, నువాగుడ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే కల్పన పండా సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణకు ముందే ప్రభుత్వం వీరికి పూర్తి పెన్షన్ మంజూరు చేసింది. ఉద్యోగ విరమణ రోజునే పూర్తి పెన్సన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ నిర్ణయాన్ని జయపురం బ్లాక్ విద్యా విభాగం అమలు చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. బ్లాక్ ఎడ్యకేషన్ అధికారి చందన కుమార్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగ విరమణ చేసిన ఇద్దరు ఉపాధ్యాయులు పూర్తి పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేసి సన్మానించారు. గౌరవ అతిథిగా విద్యాధికారి రాజేంద్ర నారాయణ పాడీ, సీనియర్ ఉద్యోగి శశిభూషణ దాస్, తదితరులు పాల్గొన్నారు.


