శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలు పెంచడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, పి.లతాదేవి, వి.హేమలత, బి.ఆదిలక్ష్మి, కె.హైమావతిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని కోరుతూ ఈనెల 11న నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు. ఇటీవల విజయవాడలో చేపట్టిన ధర్నాలో భాగంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. పోలీసు నిర్బంధాన్ని అభ్యుదయవాదులు, లౌకిక వాదులందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. అంగన్‌వాడీల 10 డిమాండ్లలో 9 డిమాండ్లు పరిష్కరించామని శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో చేసిన ప్రకటన చేయడం అసత్యమని తెలిపారు.


