పర్లాకిమిడి: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులు వల్ల అనేక నష్టాలు సంభవిస్తాయని, ఈయుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరుతూ ఉత్కళాంధ్ర ప్రోగ్రెసివ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం శాంతి ర్యాలీ చేపట్టారు. పాత అగ్నిమాపక దళం జంక్షన్ నుంచి పాతపట్నం మహేంద్రతనయ నది వరకూ ర్యాలీ జరిగింది. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువులు, పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు పెరుగుతాయని, నిరుద్యోగం సంభవిస్తుందని కాంగ్రెస్ నాయకులు బి.జనార్దనరావు అన్నారు. ర్యాలీలో అంకడాల వేణుగోపాలరావు, బర్నాల జనార్దనరావు, ఇసై వెంకట్రావు, బడేల బాబూరావు, నారాయణ రావు, జి.రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ఇంటిలోకి దూసుకెళ్లిన
అంబులెన్స్
భువనేశ్వర్: ఖుర్ధా, బొలంగీర్ 57వ నంబరు జాతీయ రహదారి దస్‌పల్లాలో శనివారం అర్ధరాత్రి దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ పెంపుడు కుక్క చనిపోయింది. అంబులెన్స్ భువనేశ్వర్ నుంచి బౌధ్ జిల్లా ఫుల్బాణి వైపు వెళుతుండగా శనివారం రాత్రి దస్‌పల్లాలోని రోడ్డు పక్కన ఉన్న బాబులా గొంతాయత్ ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటికి నష్టం వాటిల్లింది. ఇంటి యజమాని పెద్ద కుమార్తె స్వల్పంగా గాయపడింది. దసపల్లా మండలం పరిధిలోని బుగుడ మరియు బుగుడ కాలనీ మధ్య జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
586 కిలోల
గంజాయి స్వాధీనం
● ఒకరి అరెస్టు
రాయగడ: పికప్ వ్యాన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా జిల్లాలోని కాసీపూర్ పోలీసులు దాడులను నిర్వహించి పట్టుకున్నారు. వ్యాన్‌లోని బస్తాల్లో ఉన్న 586 కిలోల గంజాయితో పాటు వ్యాన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి కాసీపూర్‌లోని నారంగబడి గ్రామానికి చెందిన బిశ్వంబర్ నాయక్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు ఖురిగా కూడలిలో శనివారం రాత్రి వాహన తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో లమతాపుట్ నుంచి వయా ఖురిగా మీదుగా సికరపాయి వైపు వెళుతున్న పికప్ వ్యాన్‌ను అడ్డగించి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. మొత్తం 33 బస్తాల్లో ఉన్న 586 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఐఐసీ దేవదత్త మల్లిక్ తెలిపారు.
మూల విరాట్లకు
మహా స్నానం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో మధ్యాహ్న ధూపం తర్వాత లోపలి ప్రాంగణం (భిత్తొరొ కఠొ) నుండి దర్శనం జరుగుతుండగా ఈ ప్రాంగణంలో ధుకుడి ద్వారం దగ్గర రక్తపు జాడ తారసపడింది. ఈ సందర్భంగా శుద్ధి ప్రక్రియలో భాగంగా రత్న వేదికపై మూల విరాట్లకు మహా స్నానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులకు దర్శనంలో అవాంతరం అనివార్యమైందని శ్రీ మందిరం అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో సుమారు 2 గంటలపాటు దర్శనం స్తంభించిపోయింది.


