జయపురం: జయపురం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని మాజీమంత్రి రబీ నారాయణ నందో నేతృత్వంలో బీజేడీ శ్రేణులు కోరారు. ఈ మేరకు కొరాపుట్ ప్రాంతీయ విజిలెన్స్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జయపురం రాజుల కాలంలో ఏర్పాటు చేసిన జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనుల్లో తప్పుడు బిల్లులతో అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే 24వ వార్డులో ఎస్‌జీహెచ్ గ్రూపు పేరుపై రూ.35 లక్షలు స్వాహా చేశారని దుయ్యబట్టారు. వారం రోజుల్లో దర్యాప్తు చేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేడీ నేతలు దుర్గా ప్రసాద్ మిశ్ర, సూర్యనారాయణ రథ్, బాలారాయ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బి.సునీత, దేవరాజ్ చౌదరి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


