● మంత్రి కృష్ణచంద్ర పాత్రో
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా శనివారం నుంచి వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెంచారు. 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.60లు పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. తాజా పెరుగుదలతో భువనేశ్వర్‌లో 14.2 కిలోల వంట గ్యాస్ బండ ధర రూ.939లకి పెరిగింది. ఒడిశాలో తగినంత ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎటువంటి కొరత లేదని రాష్ట్ర ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో ప్రకటించారు. మధ్యప్రాచ్య సంఘర్షణకు సంబంధించి టెలివిజన్ ప్రసారాలు తప్పుదారి పట్టించే నివేదికలపై ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమి లేదన్నారు. దయచేసి టీవీ ఛానల్స్ లేదా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. రష్యా నుంచి చమురు వస్తోందని, దైనందిన వినియోగానికి సరఫరాకు ఎటువంటి అవాంతరం లేదని స్పష్టం చేశారు. అవాంఛిత భయాందోళనతో పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి లేదన్నారు. విభాగం అధికారులు బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ముడి చమురు మరియు ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీని నిశితంగా గమనిస్తున్నామని, ఏవైనా అవకతవకలు జరిగితే వెంటనే పరిష్కరిస్తాము. ముడి చమురును అవసరాలకు మించి కొనుగోలు చేసి అవాంచితంగా నిల్వ చేయవద్దని కోరారు.


