రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం వంశధార నది వద్ద ఆకస్మిక దాడులను నిర్వహించారు. వంశధార నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఉన్న 7 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అలాగే రూ.3.56 లక్షల జరిమానా విధించారు. దాడుల్లో డిప్యూటీ కలెక్టర్ శుభ్రత్ రౌత్, తహసీల్దార్ అభికాస్ శతపతి, అదనపు తహసీల్దార్ దీపారాణి బెహర తదితరులు పాల్గొన్నారు.


